టైమ్ మ్యాగజైన్ యూ టర్న్ తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీని ఆకాశానికెత్తేసింది. ఎన్నికలకు ముందు ప్రచురించిన కథనానికి భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. మోదీ దేశాన్ని ఏకం చేశారని తాజా కథనంపై ప్రశంసించింది టైమ్ మ్యాగజైన్. “డివైడర్ ఇన్ చీఫ్” అంటూ భారత ప్రధాని మోదీపై సంచలన కథనాన్ని ప్రచురించిన ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ఇప్పుడు స్వరం మార్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచురించిన కథనంపై కంప్లీట్ యూ టర్న్ తీసుకుంది.
మోడీకి “టైమ్” అలా కలసి వస్తోందంతే..!
మోదీ హేజ్ యునైటెడ్ ఇండియా లైక్ నో పీఎం ఇన్ డికేడ్స్ అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. మోదీ దేశాన్ని ఏకం చేశారు..ఇన్ని దశాబ్ధాల కాలంలో మరే ప్రధాని ఇలా చేయలేదంటూ పొగడ్తలతో ముంచేసింది… టైమ్ తాజా కథనం. బలహీనవర్గాల్లో పుట్టిన మోదీ… దేశంలోనే అత్యున్నత స్థాయికి చేరడం హర్షనీయమని రచయిత మనోజ్ లద్వా రాసుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్ధాల్లో ఏ ప్రధానీ దేశాన్నీ ఐక్యం చేయలేదని, మోదీ ఒక్కరే ఆ ఘనత సాధించారని లద్వా ప్రస్తావించారు. మోదీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు…తన మద్దతును పెంచుకున్నారని రచయిత అభిప్రాయపడ్డారు. ఇది మాత్రమే కాదు…భారత్‌లో ఒక ప్రధాన తప్పుడు రేఖను దాటారంటూ టైమ్ కథనంలో ప్రస్తావించారు. డివైడర్ ఇన్ చీఫ్ అంటూ మోదీపై సార్వత్రిక ఎన్నికలకు ముందు టైమ్‌లో కథనం రాశాక…పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
ఎన్నికల సమయంలో మోడీని తిట్టిపోసిన టైమ్స్..!
యూరప్, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ ముఖచిత్రంతో ఉన్న టైమ్ మ్యాగజైన్ మే 20 తేదీ సంచిక ముందుగానే మార్కెట్లో రావడంతో… సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ పెద్ద దుమారమే చెలరేగింది. ఆ ఆర్టికల్ రాసిన పాకిస్థానీ జర్నలి అతిష్ తసీర్పైనా, కవర్‌పేజీ ఆర్టికల్ ప్రచురించిన టైమ్ మ్యాగజైన్ యాజమాన్యంపైనా బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆశలు అడియాశలుగానే మిగిలాయని, భారత ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తానంటూ 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ …పాలనలో విఫలమయ్యారంటూ, మోదీ చర్యలు విద్వేషపూరిత జాతీయవాదానికి బీజం వేశాయంటూ నాటి కథనంలో రచయిత అతిష్ తసీర్ విమర్శించారు. భారత్ మోదీని మరో ఐదేళ్ల పాటు భరించగలదా ఆ రచయిత ప్రశ్నించారు. ఇప్పుడదే టైమ్ మ్యాగజైన్లో మోదీ మాదిరి దేశాన్ని ఏకం చేసిన ప్రధాని ఎవ్వరూ లేరని ప్రచురితం కావడాన్ని బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు.
అప్పుడు పాకిస్థానీ.. ఇప్పుడు ఇండియన్ రచయితలు..!
అభివృద్ధి ఫలాలు అత్యధిక ప్రజానీకానికి అందుతున్నాయని, హిందువులతో పాటు మైనార్టీ వర్గాలకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తద్వారా గతంలో ఎన్నడూ జరగనంత వేగంగా పేదరికం నిర్మూలన సాధ్యమవుతోందని రచయిత లద్వా ప్రస్తావించారు. విద్యుత్‌లేని పల్లెల్లో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయని, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటింటా మరుగుదొడ్లు నిర్మాణం చురుగ్గా సాగిందని రాసుకొచ్చారు. 1971లో ఇందిరాగాంధీ ఘన విజయం సాధించిన తర్వాత…ఐదేళ్లలో మరే ప్రధాని సాధించనంతటి ఘన విజయాన్ని మోదీ సొంతం చేసుకున్నారని ప్రస్తావించారు టైమ్ రచయిత మనోజ్ లద్వా. బీజేపీ మిత్రపక్షాలతో కలిపి 50 శాతానికి పైగా ఓట్లు సాధించడాన్ని ఇక్కడ ప్రస్తావించారు. కొసమెరుపేమిటంటే.. డివైడర్ ఇన్ చీఫ్ కథనం రాసింది పాకిస్థానీ రచయిత.. అయితే ఇప్పుడు పొగుడుతూ.. రాసింది .. భారత రచయిత.