హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరాహారదీక్ష ఆరవరోజుకు చేరింది. ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వ, ప్రతిపక్షనేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. జగన్ శరీరంలో కీటోన్లు లేవని, షుగర్ లెవల్ ఉదయం 59 ఉంటే మధ్యాహ్నం 83కు చేరిందని, దీక్షలో స్పష్టత లేదని ప్రభుత్వ నేతలు ఆరోపించగా, కీటోన్లు 3+ స్థాయిలో ఉన్నాయని, అన్నివ్యవస్థలూ కుప్పకూలే ప్రమాదముందని, కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదముందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఈ ఆరోపణలు ఎలా ఉన్నా దీక్ష భగ్నానికి సమయం ఆసన్నమయినట్లే ఉంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందో లేదో తెలియదుగానీ క్షీణించినట్లుయితే స్పష్టంగా తెలుస్తోంది. జగన్ ముఖంలో నీరసం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. సాధారణంగా ఇలాంటి ఆమరణ నిరాహారదీక్షలు చేస్తున్నపుడు ప్రమాదకర పరిస్థితికి సమీపంలోకి రాగానే ఆ దీక్ష చేస్తున్న వ్యక్తులను పోలీసులతో బలవంతంగా ఆసుపత్రి చేర్పించి సెలైన్, ఇతర ఫ్లూయిడ్స్ ఎక్కించి సాధారణ స్థాయికి తీసుకొస్తారు. 2011లో కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చున్నపుడు ఇలాగే నాలుగురోజుల తర్వాత ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి సెలైన్ ఎక్కించింది. ఆయనకూడా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించబోవటం, ఉద్యమకారులు దానిని అడ్డుకుని కేసీఆర్ నిరాహారదీక్ష కొనసాగించేటట్లు చేయటం వేరే విషయం. కాబట్టి జగన్ దీక్షనుకూడా ఇవాళో, రేపో ప్రభుత్వం భగ్నం చేయటం ఖాయం. ప్రభుత్వం భగ్నంచేయబోతోందనటానికి సంకేతం – శిబిరంవద్ద పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించటం. పగలు శిబిరంలో హడావుడి ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీసులు అర్ధరాత్రి సమయంలో భగ్నం కార్యక్రమం ప్రారంభిస్తారు. మెల్లగా దీక్ష చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి వ్యాన్‌లో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలిస్తారు. ఆ సమయంలో సాధారణంగా శిబిరంలో గొడవ అవుతుంది. అరెస్ట్ చేయొద్దని, దీక్షను కొనసాగించనివ్వాలని మద్దతుదారులు అడ్డుపడుతుంటారు. ప్రస్తుతం జగన్ దీక్షా శిబిరంలో జనం ఎక్కువ ఉన్నారుకాబట్టి పోలీసులు భగ్నం చేయటానికి వెళ్తే పెద్ద గొడవే జరిగేటట్లుంది.
మరోవైపు ఇవాళ పరీక్షలు జరిపిన డాక్టర్లు, షుగర్ లెవల్ 61కు చేరిందని, సోడియం, పొటాషియం తదితర కీలకమైన మూలకాల పరిణామం తగ్గుతోందని, కీటోన్స్ కనిపించాయని, ఆరోగ్యపరిస్థితి విషమమయ్యే అవకాశాలు ఉన్నాయని కొద్దిసేపటిక్రితం ప్రకటించారు.