హైదరాబాద్: ఆయన అసలే ‘శ్రీ’నివాసుడు. ఆయన పేరులో, ఇంటిలో, వంటిలో లక్ష్మి కొలువుతీరి ఉంటుంది. దానికితోడు ఏడుకొండలపై ఆయనకు నిత్యకళ్యాణం-పచ్చతోరణంగా భోగాలు జరుగుతుంటాయి. సంవత్సరం సంవత్సరానికీ భక్తులు సమర్పించే కానుకల విలువ పెరగటమేగానీ, తరగటమనే మాటే ఉండదు. మరి ప్రపంచంలోకెల్లా ధనవంతుడైన ఆ దేవుడికి 5.5 టన్నుల బంగారముందంటే ఆశ్చర్యమేముంటుంది! శ్రీవారికి చెందిన బంగారం 4.5 టన్నులు ప్రస్తుతం స్టేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లలో ఉందని, త్వరలో మరో టన్నును స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయబోతున్నామని టీటీడీ అధికారులు నిన్న తెలిపారు. ఈ మొత్తం బంగారం విలువ రు.1,320 కోట్లు. ఈ బంగారంమీద మళ్ళీ వడ్డీకింద ఏటా 80 కిలోల బంగారాన్ని బ్యాంకులు జమచేస్తాయట. శ్రీవారి బంగారమంతా భక్తులు హుండీలద్వారా, వ్యక్తిగతంగా బిస్కట్లు, ఆభరణాలరూపంలో సమర్పించినదేనని అధికారులు తెలిపారు. 2010నుంచి బంగారాన్ని బ్యాంక్‌లలో డిపాజిట్ చేయటం ప్రారంభించామని వెల్లడించారు.
శ్రీవారి సంపదలో ఈ బంగారం ఒక చిన్న భాగంమాత్రమేనని ఆలయ వర్గాలు చెబుతాయి. ఆయన మొత్తం సంపదను ఇప్పటివరకు బహిరంగపరచలేదు. అయితే ప్రపంచంలోకెల్ల ధనిక దేవుడన్న పేరుకు ఆయన అవతారమే అయిన తిరువనంతపురం పద్మనాభునినుంచి ఇటీవల పోటీ వచ్చినట్లనిపించినా, తిరుమల ఆలయ వర్గాలుమాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నాయి. పద్మనాభుని మొత్తం సంపద లక్ష కోట్లని చెబుతున్నారని, శ్రీనివాసుని సంపద దానికి ఎన్నో రెట్లు ఉంటుందని తిరుమల వర్గాల వాదన. వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఉన్నా చివరికి ఆ దైవంమాత్రం ఒక్కరే కదా!