తమిళనాడులో నిరర్థకంగా ఉన్న ఆస్తులను అమ్ముతున్నామని వాటిని అమ్మేస్తే.. రూ. కోటిన్నర కూడా రాదంటూ… అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరి కోటిన్నర కోసమే ఇన్ని విమర్శలను ఎందుకు ఎదుర్కొంటున్నారు.. దేవుడి ఆస్తుల్ని అమ్మేస్తున్నారనే చెడ్డపేరు ఎందుకు తెచ్చుకుంటున్నారనే దానికి మాత్రం.. సమాధానం లేదు. కానీ ఆ సమాధానం మరో రూపంలో బయటకు వస్తోంది. ఇప్పుడు తమిళనాడులోని ఆ ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేస్తే.. ఇతర ఆస్తుల అమ్మకాల్ని కూడా నిలిపివేయాలి. అంటే… ఇతర చోట్ల కూడా.. శ్రీవారి ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేశారన్నమాట.
ఉత్తరాదిలోని రిషికేష్‌లో ఉన్న ఆస్తుల దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న స్థలాల వరకూ.. వీలైనంత వరకూ అమ్మేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అందుకే.. ప్రారంభించిన ఈ ప్రక్రియపై.. హిందూ సమాజంలో ఎంత వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గకూడదని అనుకుంటోంది. శ్రీవారికి భక్తులు ఎప్పటికప్పుడు విరాళాల రూపంలో ఆస్తులు కూడా ఇస్తూంటారు. భక్తులు ఇచ్చేది.. శ్రీవారికి ఉపయోగపడుతుందనే.. అమ్ముకోమని కాదు. అలా టీటీడీ అమ్మేసి.. ఆ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తుందని తెలిస్తే.. భక్తులు కూడా విరాళాలుగా ఆస్తుల కాకుండా నగదే ఇచ్చేవారమో..? .
ధర్మపరిరక్షణ కోసం… ధర్మ ప్రచారం కోసం.. తాము కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని వినియోగించుకుంటారన్న ఉద్దేశంతో భక్తులు ఇస్తారు. కానీ టీటీడీ వాటిని ఆస్తి రూపంలోనే చూస్తోంది. దాతల మనోభావాలతో ముడిపడి ఉన్న సెంటిమెంట్‌ను పట్టించుకోవడం లేదు. టీటీడీ వెనక్కి తగ్గే అవకాశమే లేకుపోవడంతో.. ఈ ఆస్తుల అమ్మకం వివాదం మరింత ముదిరిపోయే అవకాశం కనిపిస్తోంది.