కరోనా టైంలో పెద్దగా భక్తులు ఎవరూ రాకపోతూండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు బాగా సమయం దొరికినట్లుగా ఉంది. హనుమంతుని జన్మస్థలంపై వాదనకు సిద్ధమయింది. హనుమంతుడి జన్మస్థలం తిరుమలలో అంజనాద్రేనని టీటీడీ శ్రీరామనవమి రోజు ప్రకటించుకుంది. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మండిపడింది. టీటీడీకి పరుష పదజాలంతో లేఖలు రాసింది. ఈ లేఖలపై… టీటీడీ కూడా స్పందించింది. బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేసింది. దీంతో రెండు వర్గాలు సవాల్ చేసుకున్న మేరకు… వాదనకు సిద్ధమయ్యాయి.
గురువారం.. హనుమంతుని జన్మస్థానంపై రెండు వర్గాలు ఆధారాలు బయటపెట్టనున్నాయి. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో ఇరుపక్షాలు ఎదురెదురుగా కూర్చుని ఎవరి ఆధారాలు వారు బయట పెడతారు. కిష్కింద ట్రస్ట్ తరపున చర్చలో గోవిందానంద సరస్వతి పాల్గొంటారు. ఆయన రెండు రోజుల ముందే తిరుమల చేరుకున్నారు. సంచలనాత్మక విషయాలు బయట పెడతానని ఆయన తిరుపతిలో అడుగుపెట్టగానే చెప్పుకొచ్చారు.
టీటీడీ తరపున చర్చలో హనుమంతుని జన్మస్థానం అంజనాద్రేనని ప్రకటించిన కమిటీ కన్వీనర్, సభ్యులు పాల్గొంటారు. ఈ వివాదం హిందూ సమాజంలో కలకలం రేపుతోంది. శ్రీవారి పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుమలను.. హనుమంతుని జన్మస్థానంగా కూడా.. చెప్పేందుకు టీడీపీ ఎందుకు తాపత్రాయపడుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటి వరకూ కర్ణాటకలోని కిష్కిందనే ఎక్కువగా హనుమంతుని జన్మస్థానంగా భావిస్తూంటారు ఈ వివాదాన్ని టీటీడీ అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది కానీ.. తగ్గించడం లేదు.