తిరుపతికి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా వైసీపీకి హ్యాండిచ్చారు. ఆయన రాత్రికి రాత్రి తిరుపతిలోని తన ఆస్పత్రి నుంచి మాయమయ్యారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండటంతో ఆయనను వైసీపీ నేతలు ఓ కంట కనిపెట్టుకుని ఉన్నారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్సీగా ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. ఆయన కార్పొరేటర్లలాగా హ్యాండివ్వరని అనుకున్నారు. కానీ ఆయన కూటమి నేతలతో మాట్లాడుకుని ఆ క్యాంపు లోకి వెళ్లిపోయారు. దీంతో. ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు.
ఎన్నికలకు ముందు తిరుపతిలో టీడీపీకి ఒక్కరంటే ఒక్క కార్పొరేటర్ ఉండేవారు. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి భూమన తన కుమారుడు అభినయ్ రెడ్డితో రెండోడిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయించారు. ఆ పదవిని ఇప్పుడు గెలుచుకోలేకపోతే ఆయన జిల్లా అధ్యక్ష పదవి కూడా నవ్వుల పాడవుతుంది. పూర్తి స్థాయిలో మెజార్టీ ఉండి గెలిపించుకోలేని ఆయన రాజకీయంగా దెబ్బతింటారు. అందుకే అందర్నీ గట్టిగా పట్టుకుని ఉంటున్నారు.
కానీ మెల్లగా కార్పొరేటర్లు భూమన పట్టు విడిపించుకుని కూటమి క్యాంపులో చేరిపోతున్నారు. సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం బస్సులో వచ్చిన కార్పొరేటర్లు బస్సు దిగగానే టీడీపీ క్యాంపులో చేరిపోయారు. దీంతో వారిని కిడ్నాప్ చేశారని భూమన వర్గం ఆరోపించింది. కానీ వారు తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వీడియోలు రిలీజ్ చేశారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా అలాగే వీడియో రిలీజ్ చేసే చాన్స్ ఉంది. మొత్తంగా తిరుపతి వైసీపీ కకావికలం అవుతోంది.