తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కరోనా సోకి మరణించారు. ఆయన పదిహేను రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా సోకినట్లుగా బయటకు తెలియలేదు. పరిస్థితి రోజు రోజుకు విషమించడంతో… పదిహేనురోజుల చికిత్స తర్వాత ఆయన కన్నుమూశారు. గత ఎన్నికల ముందు వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. గత ఎన్నికల్లో ఎక్కడా టీడీపీ నుంచి టిక్కెట్ లభించకపోవడంతో… వైసీపీలో చేరారు. తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు.
చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన బల్లి దుర్గాప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో రాజకీయాల్లోకి వచ్చి.. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో మృతి చెందిన తొలి ప్రజాప్రతినిధి బల్లి దుర్గాప్రసాదరావు.
తెలంగాణలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోయారు. అయితే ఆయనకు కరోనా నిర్ధారణ కాలేదు. వారి కుటుంబసభ్యులందరికీ వచ్చింది. మాజీ మంత్రి మాణిక్యాలరావు కూడా కరోనా కారణంగా చనిపోయారు. అయితే ఆయన మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. డెడ్లీ వైరస్ దెబ్బకు…దేశవ్యాప్తంగా చనిపోయిన రెండో ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు. తమిళనాడులో కాంగ్రెస్ ఎంపీ ఒకరు కరోనాతో చనిపోయారు.