ఇంట్లో విలన్ అయితే బయట ప్రపంచానికి హీరో ఎలా అవుతాడని ఇటీవల సుప్రీంకోర్టు.. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ కామెంట్ చేసింది. కనీసం సుప్రీంకోర్టు కామెంట్స్ తో అయినా అసలు తమ కుటుంబంలో ఏం జరుగుతుందో..కుటుంబ పెద్దగా తానేం చేస్తున్నానో మోహన్ బాబు గుర్తించలేకపోతున్నారు. మనోజ్ ను అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు.
తిరుపతిలో మంచు మనోజ్ ను పోలీసులు అర్థరాత్రి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదం అయింది. మంచు మనోజ్ తిరుపతి సమీపంలోని లేక్ వ్యూ రిసార్ట్స్ లో బస చేశారు. సోమవరాం రాత్రి 11 గంటల సమయంలో అక్కడ పోలీసులు తనిఖీలు చేశారు. మంచు మనోజ్ ను గుర్తించి దట్టమైన అటవీ ప్రాంతం దగ్గర మీలాంటి సెలబ్రిటీ ఉండకూడదని వెళ్లిపోవాలని సూచించారు. తన ప్రైవసీకి భంగం కలిగించారని మనోజ్ పోలీసులపై మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ్నుంచి సీమకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు. 12.30కు ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
యూనివర్శిటీ వ్యవహారాల్లో మనోజ్ జోక్యం చేసుకుంటారన్న భయంతో మనోజ్ రిసార్ట్స్ లో ఉన్నారని పంపించేయాలని మోహన్ బాబు వైపు నుంచి వచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. మనోజ్ రెండు రోజుల ముందు లోకేష్ ను తిరుపతిలోనే కలిశారు. దీంతో మోహన్ బాబు అప్రమత్తమయినట్లుగా తెలుస్తోంది. మనోజ్ యూనివర్శిటీకి సంబంధించి అక్రమాలపై పోరాడాలని అనుకుంటున్నారు. ఆయనను కట్టడి చేసేందుకు మోహన్ బాబు తన పరపతిని ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.