పాటలకు ట్యూనింగ్ కి తగిన పదాల అల్లిక సరిపోతుందని అనుకొంటారు చాలామంది. అలాంటి పాటలు రెడీమెడ్ హిట్ అవుతాయి కూడా. కానీ కలకాలం నిలబడాలంటే సాహిత్యంతో స్వరం దోస్తీ కట్టాలి. కొన్ని పాటలు రాయాలన్నా, వాటిని సినిమాల్లో వినిపించాలన్నా – దర్శక నిర్మాతలకు సాహిత్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. ముఖ్యంగా సంస్కృత పదాల్ని, పదునైన వాక్యాల్నీ రాయడానికి చాలామంది ఇష్టపడరు. అది సామాన్యులకు అర్థం అవుతుందా, లేదా? అని సంశయం చూపిస్తారు. కానీ సరిగ్గా కుదరాలే కానీ, కొన్ని పాటలు శ్రోతల మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొంటాయి. ‘ఖలేజా’లో సదాశివ సన్యాసీ పాట వినగానే జనంలోకి వెళ్లిపోలేదు. కానీ కాలం గడిచే కొద్దీ… ఆ పాట తన విశిష్టతను మరింత విస్తరించుకొంటూ వచ్చింది. అలాంటి పాట.. ఇప్పుడు ‘హరోం హర’ సినిమాలోనూ వినిపిస్తోంది. సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్ చక్రవర్తి రాసిన టైటిల్ గీతం ‘హరోం హర’ అనే పాటని చిత్రబృందం విడుదల చేసింది. అనురాగ్ కులకర్ణి పాడారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. పాటలో మంచి బీట్ ఉంది. హీరో ఎలివేషన్లకు ఆ బీట్, రిధమ్, లిరిక్స్ చక్కగా సరిపోతాయి. కథాగమనాన్ని పాట కూడా పరిచయం చేస్తుండాలి. కథని ముందుకు తీసుకెళ్తుండాలి. ఈ పాట కూడా అలానే అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో సంస్కృత పదాలు ఎక్కువగా కనిపించాయి. కొన్నింటికి అర్థాలు తెలిసినవే. ఇంకొన్ని తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది.
”ఎడారికే పయణమై కదిలొచ్చేటి మేఘానికే
ఎడా పెడా అశురువే ఎగిరెనే పైకి
ఎకాయెకి తరుణమై తరలొచ్చేటి యాగానికే
ముఖాముఖీ సమిధలే ఎగసేదూకే” అంటూ మొదలైంది పాట.
”దుర్వార దుర్మార్గ మణచరా
హరి ఓం హరోం హరోం హర
ధణ్వీర దండించుహర దళనతివర
దుర్నీతి దుర్గాన్ని చణకరా
దుర్భీతి నిద్దించుపరా హరి ఓం..”
నువు తాకిన అనువు అలమలం, నువు కదిపిన అడుగు కలకలం, నువు మాకే అభయమనగలం అనే చోట పదాల అమరిక బాగా కుదిరింది. ఈ అక్షరాల్లోనే ఆకాశమంత హీరోయిజం కనిపించింది. ‘సరా సరీ సుధీరా..’ అంటూ సుధీర్‌బాబు పేరుని కూడా రిధమ్ కి తగినట్టు వాడుకొన్నారు.
మొత్తానికివ చేతన్ భరద్వాజ్ ట్యూన్ వినగానే ఆకట్టుకొనేలా ఉంది. ఈ పాటని సినిమాలో ఎలా వాడుకొన్నారో, ఎలాంటి సందర్భంలో వస్తుందో అనే ఆసక్తి కలిగింది. ఈమధ్య చాలా పాటలొచ్చాయి కానీ, ఓ పాటలోని సాహిత్యం సందర్భానికీ, టైటిల్ కీ తగ్గట్టు కురదడం కాస్త అరుదుగానే కనిపిస్తోంది. అలాంటి పాటల్లో `హరోం హర`ని చేర్చొచ్చు.