బోయపాటి శ్రీను కథలే, కాదు టైటిళ్లు పవర్ ఫుల్‌గా ఉంటాయి. భద్ర, సింహా, లెజెండ్, దమ్ము.. ఇలా టైటిల్‌తోనే మాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే… ఈమధ్య ఆయన మనసు మారింది. కాస్త పొయెటిక్, క్లాస్ టచ్ ఇద్దామని ప్రయత్నించారు. ‘జయ జానకీ నాయక’ అంటూ… దారి మార్చారు. సినిమాలో ఆయన స్థాయి మాసిజం కనిపించింది. టైటిల్లో మాత్రం పొయెటిక్ టచ్ తగిలింది. టైటిల్ ఎఫెక్ట్ సినిమాపై కాస్తో కూస్తో పడింది. ఆ సినిమాకి రావల్సినంత వసూళ్లు దక్కలేదు. దానికి కారణం.. టైటిల్ మరీ క్లాసీగా అయిపోవడమే. అందుకే.. ఈసారి ఎలాగైనా సరే – మాస్ మసాలా టైటిలే పెట్టాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం క్లాసీ టైటిళ్ల హవా నడుస్తోంది. రామ్ చరణ్ సినిమాలోనూ.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువే ఉన్నాయట. ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం థియేటర్‌కి రప్పించాలంటే… కాస్త పొయెటిక్ టైటిల్ పెడితే బాగుంటుందని చరణ్ భావిస్తున్నాడట. అందుకే `మంచి తెలుగుదనం ఉన్న టైటిల్ పెట్టండి` అని బోయపాటికి సూచించాడట చరణ్. ఇప్పటికే ‘జయ జానకీ నాయక’ బాగా దెబ్బకొట్టి ఉంది. ఈ దశలో.. మళ్లీ క్లాస్ టైటిల్ ఎందుకు? అన్నది బోయపాటి భయం. అందుకే టైటిల్ విషయంలో ఏదీ తేల్చుకోలేకపోతున్నాడట. మరి… చరణ్, బోయపాటిలో ఎవరి మాట నెగ్గుతుందో?