త్రివిక్రమ్ కథా రచయితగా, దర్శకుడిగా తెలుసు. కానీ త్రివిక్రమ్ పాటలు కూడా రాశాడన్న విషయం చాలామందికి తెలీదు. రవితేజ నటించిన ఒక రాజు, ఒక రాణి కోసం త్రివిక్రమ్ పాటలు రాశాడు. ఆ పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. కానీ.. పాటల రచయితగా త్రివిక్రమ్ పేరు మాత్రం బయటకు రాలేదు. ఆ తరవాత త్రివిక్రమ్ కి అలాంటి ఆఫర్లు వచ్చినా, ఎప్పుడూ పాట కోసం పెన్ను పట్టుకోలేదు. “అప్పుడంటే.. డబ్బుల కోసం రాశాను. పాట రాసే… పని నాది కాదు. అందుకు చాలామంది ఉన్నారు“ అని చెప్పుకునే వాడు త్రివిక్రమ్. అయితే ఇప్పుడు త్రివిక్రమ్, తన స్నేహితుడు పవన్ కల్యాణ్ కోసం 18 ఏళ్ల తరవాత పాట రాశాడు.
`భీమ్లా నాయక్` సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఈ రోజు విడుదలైన `లాలా… భీమ్లా` పాటని త్రివిక్రమే రాశాడు. భీమ్లా నాయక్… హీరోయిజాన్ని, వ్యక్తిత్వాన్ని, ధీరత్వాన్ని హైలెట్ చేసిన గీతమిది. “పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు…
పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు…“ అంటూ పాటలో పదాలు పరుగులు పెట్టాయి. “లాలా భీమ్లా
అడవి పులి
గొడవ పడి
ఒడిసి పట్టు
దంచి కొట్టు
కత్తి పట్టు
అదరగొట్టుష అనే మాటలు ఎవరైనా రాసేస్తారేమో గానీ, కొన్ని చరణాల్లో కనిపించిన పద విన్యాసం త్రివిక్రమ్ కే సాధ్యం అన్నట్టున్నాయి. మొత్తానికి పాటలోనూ తనదైన మార్క్ చూపించాడు త్రివిక్రమ్. భవిష్యత్తులో అప్పుడప్పుడూ ఇలా పాట కోసం మాట కదుపుతారేమో చూడాలి.