ఒకప్పుడు టీఆర్ఎస్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ జేఏసీ… ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్న టీ జేఏసీ చైర్మన్ కోదండరాం… ఇప్పుడు ఆయన తీరును తీవ్రంగా దుయ్యబడుతున్నారు. టీ జేఏసీ, టీఆర్ఎస్ మధ్య అప్పుడప్పుడూ మాటల యుద్ధం కూడా సాగుతోంది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీడియా సపోర్ట్ ఎక్కువగా ఉందని గమనించిన టీ జేఏసీ… త్వరలోనే సొంతంగా పత్రికను ప్రచురించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సొంతంగా పత్రికతో పాటు వెబ్ సైట్ ను కూడా ప్రారంభించాలని టీజేఏసీ ప్రతినిధులు నిర్ణయించుకున్నారు.
అయితే టీ జేఏసీకి దినపత్రిక ఏర్పాటు చేసేందుకు ఆర్థిక స్థోమత ఉండదు కాబట్టి… వారి నేతృత్వంలోనే వార పత్రిక లేదా మాస పత్రిక వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తమ అభిప్రాయాలను, తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని… తద్వారా వచ్చే ఎన్నికల్లో మరింత కీలక భూమిక పోషించాలన్నది టీ జేఏసీ ఆలోచనగా కనిపిస్తోంది. టీ జేఏసీ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ… ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ప్రజలు జేఏసీని పట్టించుకునే అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి కొత్త పత్రిక, వెబ్ సైట్ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న టీజేఏసీ… ప్రజలను ఎంత మేరకు తమ వైపు తిప్పుకుంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.