ప్రజాకూటమిగా పేరు మార్చుకున్న మహాకూటమిలో చివరకు… ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించినప్పటికీ.. ఆ స్థానంలో.. తెలంగాణ జన సమితికూడా పోటీ చేయబోతోంది. టీడీపీ తరపున ఎర్ర శేఖర్‌కు.. బీఫాం ఇచ్చారు. టీజేఎస్ తరపున రాజేందర్ రెడ్డికి… కోదండరాం బీఫాం ఇచ్చారు. నిజానికి మహబూబ్ నగర్ సీటుపై అన్ని పార్టీలు కన్నేశాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా ఎవరికి చాన్స్ ఇచ్చినా మిగతా వారు రెబల్ నామినేషన్లు వేయడం ఖాయమని అనుతున్నాకుయ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసమే ఐదుగురు నేతలు పోటీ పడ్డారు. వారిలో ఎవరూ గెలిచేంత పెద్ద నేత కాకపోవడంతో… టీడీపీకి కేటాయించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేతగా ఎర్ర శేఖర్‌కు… చాలా పరిచయాలు ఉన్నాయి. జడ్చర్ల నుంచి పలుమార్లు గెలిచారు కూడా. బలమైన అభ్యర్థి అవుతారన్న ఉద్దేశంతో.. కాంగ్రెస్ నేతలు కూడా.. ఎర్ర శేఖర్‌కు మద్దతు ప్రకటించారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో సగం పట్టణం..సగం గ్రామీణ ప్రాంతం ఉంటుంది. రూరల్ మండలాలలో పరిమితమైన ఓట్లే ఉంటాయి. అర్బన్ ప్రాంతం మాత్రం కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ప్రాంతం. 2009 ఎన్నికలకన్నా ముందు దాకా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పాలమూరు నగరం ఉంది. మునిసిపాలిటీ ఒక్కసారి తప్ప ఎప్పుడూ కాంగ్రెస్ గుప్పిట్లోనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. అందుకే మహాకూటమి గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు టీజేఎస్ ఫ్రెండ్లీ ఫైట్‌కు దిగింది. జన సమితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ రాజేందర్ రెడ్డి చాలా కాలంగా కోదండరాంతో కలసి పని చేస్తున్నారు. జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులుగా ఉన్న రాజేందర్ రెడ్డి గత ఎన్నికల తర్వాత తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. కోదండరాం..కాదంటే.. బీజేపీ తరపున అయినా పోటీ చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. చివరికి కోదండరామే బీఫాం ఇచ్చారు.
నిజానికి మహాకూటమి ఏర్పడటం.. అందులో తెలుగుదేశం పార్టీ ఉండటంతోనే… టీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదన్న వాతావరణం ఏర్పడింది. అందుకే తెలుగుదేశంపార్టీ కూడా.. గెలిచే స్థానాలే తీసుకోవాలనుకుంది. ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టలేదు. పధ్నాలుగు సీట్లే తీసుకుంది. అందులోనూ… ఓ స్థానంలో టీజేఎస్.. అభ్యర్థి ఫ్రెండ్లీ ఫైట్‌కు దిగారు. బీఫాం కూడా ఇచ్చేశారు కాబట్టి.. ఇక రాజేందర్ రెడ్డి.. వెనక్కి తిరిగే అవకాశం ఉండకపోవచ్చు. అంటే.. పాలమూరులో కూటమి పార్టీల మధ్య ఫ్రెండ్లీ ఫైట్ ఉంది. మరి కోదండరాం ప్రచారం ఎవరి తరపున చేస్తారో మరి..!