జేఏసీ కన్వీనర్‌గా… ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం.. ఇప్పుడు రాజకీయ పార్టీ అధ్యక్షుడు. తొలినుంచి లెఫ్ట్ భావజాలం ఉన్న కోదండరాం…ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కోదండరాం తన సొంత జిల్లా అయిన మంచిర్యాలలోనే పోటీ చేస్తారా? లేకపోతే రాజధాని హైదరాబాద్ లో పోటీ చేస్తారా? లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బరిలో దిగుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోదండరాం సొంత ఊరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా . ముందస్తు ఎన్నికల్లో ఆయన మంచిర్యాల నుంచే పోటీ చేస్తారని తెలంగాణ జనసమితి వర్గాలు చెబుతున్నాయి. సొంత జిల్లా కావడం.. దాంతోపాటు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సింగరేణి కార్మికులతో కోదండరాం కు బలమైన సంబంధాలు ఉండడంతో ఆయన ఆ సీటును ఎంచుకుంటే సునాయాసంగా గెలుస్తారన్నది జనసమితి నేతల అంచనా.
మంచిర్యాలకు పక్కనే ఉన్న రామగుండం, వరంగల్ వెస్ట్ , లేదా జనగాం నుంచి కూడా కోదండరాం పోటీ చేయవచ్చన్న ప్రచారం నడుస్తోంది. జనగాం నుంచి కాంగ్రెస్ సీనియర్ పొన్నాల లక్ష్మయ్య టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏదో ఒక స్థానం నుంచి కోదండరాం పోటీ చేసే చాన్స్ ఉందంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి. సింగరేణి ఉద్యోగులు, కమ్యూనిస్ట్ బావజాలమున్న చోట డబ్బు ప్రలోభాలు పనిచేయవన్న భావన ఉంది. ఇందులో భాగంగానే కోదండరాం… మంచిర్యాల లేదంటే రామగుండం నుంచి పోటీ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు అసలు కోదండరాం పోటీ చేయరని.. పోటీ చేయకుండా మహాకూటమి తరుపున ప్రచారం చేస్తారనే చర్చ జరుగుతోంది. కూటమి తరుపున కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కు కోదండరామే చైర్మన్ కాబట్టి.. కూటమి తరుపున ప్రచారం చేసే అవకాశం ఉందని పార్టీ నేతలంటున్నారు. కోదండరాం గత చరిత్ర అంతా లెఫ్ట్ నేపథ్యం కాబట్టి.. లెఫ్ట్ పార్టీల్లో కీలక నేతల మాదిరిగా పోటీ చేయకుండా తన వారిని బరిలోకి దింపి గెలిపించుకునేందుకు ఎత్తుగడ వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జన సమితి నేతలంటున్నారు. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.