మహాకూటమి పక్షాల మధ్య సీట్ల గొడవ చల్లారలేదు. కాంగ్రెస్ ప్రకటించిన ఎనిమిది సీట్లకు అంగీకరించినట్లుగా ప్రకటనలు చేసిన తెలంగాణ జనసమితి ఇప్పుడు 12 సీట్లలో బరిలో ఉంటామని.. స్పష్టం చేసింది. రోజుల తరబడి చర్చలు తర్వాత.. కోదండరాం ఎనిమిది సీట్లకు అంగీకరించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పటికే 75 మందితో కాంగ్రెస్ రెండు జాబితాలు ప్రకటించింది. రెండో జాబితాతో టిజేఎస్ కు ఇస్తామన్న సీట్లలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించింది. దీంతో.. తెలంగాణ జనసమితి 8 సీట్ల నిర్ణయం మార్చుకుని 12 సీట్లలో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. మొదటి నుంచి 12 సీట్లనే తాము కోరుతున్నామని.. దీనికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నామని టీజేఎస్ ప్రకటించింది.
అంతేకాదు జనగామపై కూడా టీజేఎస్ స్పష్టత ఇచ్చింది. పొన్నాల కోసం ఈ సీటును వదులుకోవాలని కోదండరామ్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా జనగామ సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు.. కానీ ఇప్పుడు మాత్రం జనగామలో కూడా పోటీ చేస్తామని జనసమితి నేతలు చెబుతున్నారు. టిజేఎస్ పోటీ చేస్తామని ప్రకటించిన స్థానాల్లో స్టేషన్ ఘన్ పూర్, ఆసిఫాబాద్ కు ఇదివరకే కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. తమకు కేటాయించిన సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినా వారిని ఆ పార్టీయే విత్ డ్రా చేయిస్తుందని టీజేఎస్ నేతలు చెబుతున్నారు. మహాకూటమిలోనే ఉంటామని.. విడిగా పోవడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ తీరుపై సీపీఐ కూడా అసంతృప్తిగానే ఉంది.
పొత్తులో భాగంగా హుస్నాబాద్‌ను సీపీఐకు ఇచ్చారు. కానీ హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నేత ప్రవీణ్‌రెడ్డి నామినేషన్ వేశారు. అలాగే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పొత్తులో భాగంగా టీటీడీపీకి ఇచ్చారు. రేవూరిని టీటీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈ సీటు కోసం కొన్ని రోజులుగా నిరసనలకు దిగిన నాయిని రాజేందర్‌రెడ్డి చివరకు కాంగ్రెస్ రెబెల్‌గా నామినేషన్ వేశారు. వీరందర్నీ కాంగ్రెస్ పార్టీనే బుజ్జగించి.. బరిలో లేకుండా చేయాలని ఆయా పార్టీలు కోరుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం.. ఈ విషయంలో చివరికి చేతులెత్తేలేసేలా ఉంది.