తెలంగాణ మహాకూటమిలో చేరుతున్నట్లు.. కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జన సమితి అధికారికంగా ప్రకటించింది.టీ టీడీపీ అద్యక్షుడు ఎల్.రమణ నివాసంలో సీపీఐ, టీజేఎస్ నేతలు సమావేశమయ్యారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి. టీజేఎస్ నేత దిలీప్ కుమార్ సహా పలువురు నేతలు చర్చలు జరిపారు. అక్కడ్నుంచి కోదండరాంతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. చివరికి మహాకూటమిలో చేరేందుకు కోదండరాం అంగీకరించారు. మహాకూటమితోనే టీఆర్ఎస్ను ఎదుర్కోగలమని నమ్ముతోన్న తెలంగాణ జనసమితి నమ్ముతోంది.మహాకూటమి తరపున..ఓ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నారు. దీనికి చైర్మన్ గా కోదండరాంను చేసే అవకాశం ఉంది. మహాకూటమి అధికారంలోకి వస్తే.. కనీస ఉమ్మడి కార్యక్రమం చైర్మన్ గా కోదండరాం..కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
మహాకూటమిలో చేరేందుకు తెలంగాణ జన సమితి అంగీకరించడంతో.. ఒక్క సీపీఎం మినహా మిగతా పక్షాలన్నీ ఏకమైనట్లయింది. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ మహాకూటమిలో భాగమవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు టీజేఏస్ కూడా కూటమిలో చేరింది. తెలంగాణ ఇంటి పార్టీ, యువ తెలంగాణ పార్టీ లాంటి చిన్న పార్టీలను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి… కూటమిలోకి ఆహ్వానించారు. వారు కూడా సంసిద్ధత తెలిపారు. ఇక సీపీఎంతోనూ చర్చలు జరుపుతామని మహాకూటమి నేతలు ప్రకటించారు. అయితే బహుజన లెఫ్ట్ ఫ్రంట్.. పేరుతో ఓ కూటమి పెట్టి…సొంతంగా పోటీ చేస్తామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రకటిస్తున్నారు. జనసేనతో పొత్తు కోసం… వీరభద్రం ప్రయత్నిస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ ఏ విషయం చెప్పడం లేదు. గత ఆదివారం.. మంగళ, బుధవారాల్లో .. సీపీఎం నేతలతో నేరుగా పవన్ కల్యాణ్ సమావేశమవుతారని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కానీ… అలాంటి భేటీ ఏదీ జరగలేదు. సీపీఎం విడిగా పోటీ చేసినా.. పెద్దగా ఓట్లు చీలే పరిస్థితి ఉండదు కానీ.. ఆ పార్టీని కూడా… మహాకూటమిలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేయడం తమ జాతీయ విధానం కాదని… సీపీఎం నేతలు చెబుతున్నారు. కానీ జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పుల కారణంగా.. సీపీఎం కూడా… మహాకూటమిలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుోతంది.
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విజయవంతంగా పూర్తయితే.. తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా ద్విముఖ పోటీలే ఉంటాయి. అయితే టీఆర్ఎస్ లేకపోతే మహాకూటమి అభ్యర్థి అన్న చాయిస్ ఓటర్లకు లభిస్తుంది. గత ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. దాంతో టీఆర్ఎస్ చాలా తక్కువ మెజార్టీతో అనేక నియోజకవర్గాల్లో బయటపడింది. ఈ సారి ఆ పరిస్థితి రాదని.. మహాకూటమి అంచనా వేస్తోంది.