తెలంగాణ జనసమితి పార్టీకి అంతిమంగా నాలుగు స్థానాలు దక్కాయి. సిద్దిపేట, వర్థన్నపేట, మల్కాజ్గిరి, అంబర్పేటలో మాత్రం టీజేఎస్ మహాకూటమి పార్టీలు అండగా.. టీఆర్ఎస్ పై పోటీ చేస్తోంది. వరంగల్ తూర్పు, దుబ్బాక, ఖానాపూర్లో కాంగ్రెస్తో..అశ్వరావుపేటలో టీడీపీతో టీజేఎస్ స్నేహపూర్వక పోటీలు ఖాయమయ్యాయి. టీజేఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేసిన మిర్యాలగూడ, మెదక్, మహబూబ్నగర్లో వారి అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు వారి అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరించుకోలేకపోయారు. ఫలితంగా.. తెలంగాణ జనసమితి నాలుగు స్థానాలకే పరిమితమయినట్లయింది.
ఉద్యమనేతగా తెలంగాణ వాదుల్లో కోదడంరాంకు ఉన్న ఆదరణను ఉపయోగించుకోవడానికి.. తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్ పెద్ద పీట వేశారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేయడానికి కోదండరాంను కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సీటు చొప్పున.. 17 సీట్లలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని టీజేఎస్ మొదటి నుంచి పట్టుబట్టింది. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు ఖరారు చేసింది. ఆ ఎనిమిది స్థానాలపైనా నామినేషన్ల గడువు ముగిసేవరకూ క్లారిటీ ఇవ్వలేదు. చివరికి నాలుగు స్థానాల్లో మాత్రమే నేరుగా.. పోటీ చేసే అవకాశం కల్పిచింది. మరో నాలుగు స్థానాల్లో టీజేఎస్ స్నేహపూర్వక పోటీలకు సిద్ధమయింది.
నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసే సరికి కూటమిలో కొన్ని కీలకమైన స్థానాల్లో రెబల్ అభ్యర్థులను ఉపసంహరించుకునేలా చేయడంలో.. కాంగ్రెస్ పెద్దలు సక్సెస్ అయ్యారు. అయితే టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మల్ రెడ్డి రంగారెడ్డిని మాత్రం పోటీ నుంచి తప్పించలేకపోయారు. పైగా.. అక్కడ మల్ రెడ్డి రంగారెడ్డికే కాంగ్రెస్ మద్దతిస్తోందన్నట్లుగా ప్రచారం చేస్తూ గందరగోళంలోకి నెట్టారు. కానీ టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి తన ప్రచారం తాను చేసుకుంటున్నారు. వరంగల్ పశ్చిమ స్థానం నుంచి నామినేషన్ వేసిన నాయని రాజేందర్ రెడ్డి కూడా ఉపసంహరించుకున్నారు. దాంతో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఊరట లభించినట్లయింది.