లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయాయి. మళ్లీ సెట్స్‌లో ఎప్పుడు హడావుడి మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులైనా చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని చిత్రసీమ ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే.. ఈ విషయంలో తమిళ చిత్రసీమకు ఓ గుడ్ న్యూస్. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈనెల 11 నుంచి డబ్బింగ్, రీ రికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ లాంటి కార్యక్రమాల్ని నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. లాక్ డౌన్ వల్ల సినిమాలన్నీ ఆగిపోయాయని, చిత్రసీమలో వందల కోట్ల రూపాయలు స్థంభించిపోయాయని, ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. కార్మికుల బతుకులు ఛిద్రం అవుతాయని తమిళ నిర్మాతలంతా కలిసి ప్రభుత్వానికి ఓ వినతి పత్రం సమర్పించింది. షూటింగులు లేకపోయినా ఫర్వాలేదు, కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులకైనా అనుమతులు ఇవ్వాలని కోరింది. దీనిపై తమిళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఈ విషయంలో తెలుగు చిత్రసీమకూ లాభమే. ఎందుకంటే… మన సినిమాలకు సంబంధించిన రీ రికార్డింగ్ పనులు దాదాపుగా తమిళనాడులోనే జరుగుతాయి. కాబట్టి.. తెలుగు సినిమాల ఆర్.ఆర్ చెన్నైలో హాయిగా చేసుకోవొచ్చు. తమిళనాడు ప్రభుత్వం ఎలాగూ అనుమతులు ఇచ్చింది కాబట్టి, త్వరలోనే తెలుగు ప్రభుత్వాలూ ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.