రెండు దశాబ్దాల క్రితం శంకర్ దర్శకత్వం లో ప్రభుదేవా, నగ్మా కాంబినేషన్ లో ప్రేమికుడు అనే సినిమా వచ్చింది. అందులో గవర్నర్ పాత్రని మెయిన్ విలన్ గా చూపించారు. గిరీష్ కర్నాడ్ పోషించిన ఆ పాత్ర, ఆ సినిమా పెద్ద హిట్టాయ్యాయి. సాధారణంగా పొలిటీషియన్స్ ని విలన్స్ గా చూపించడం భారతీయ సినిమాల్లో పరిపాటే కానీ రాజ్యాంగబద్ద పదవులు అయిన గవర్నర్, రాష్ట్రపతి లాంటి పాత్రల విషయం లో నెగటివ్ గా చూపించడానికి దర్శక రచయితలు ప్రయత్నించరు. ఆ పదవుల మీద వారికి ఉన్న సదభిప్రాయం వల్లో, ఆ పదవులకి ఉన్న డిగ్నిటీ వల్లో లేక చట్ట పరమైన ఇబ్బందులు వస్తాయన్న భయం వల్లో అలా చేస్తుంటారు. కానీ శంకర్ రూటే వేరు. రెండో సినిమా లోనే ఆ సాహసం చేసాడు. అయితే ఆశ్చర్యమేంటంటే, ఆ పాత్రకి సెన్సార్ నుండే కాక ప్రజల నుండీ మంచి ఆమోదం లభించడం. అయితే మునుపటి తమిళ నాడు గవర్నర్ అయిన మర్రి చెన్నారెడ్డి ఉద్దేశ్య పూర్వకంగా అప్పటి తమిళ నాడు ప్రభుత్వ ప్రయోజనాలకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకి అనుగుణంగా వ్యవహరించాడనే రూమర్లుండేవి. దాని పోలికలతో గిరీష్ కర్నాడ్ పాత్ర ఉండటం తో అది అప్పటి ప్రేక్షకులకి విపరీతంగా ఎక్కేసింది. అయితే మర్రి చెన్నారెడ్డి తర్వాత ఆ తరహా రూమర్లు తమిళ ప్రజల్లో వచ్చింది మాత్రం ప్రస్తుత గవర్నర్ విద్యా సాగర్ రావు విషయం లోనే. ఇంతకీ గవర్నర్ విద్యాసాగర్ నిర్ణయాలు ఎందుకని డిబేట్ కి కారణమవుతున్నాయో చూద్దాం.
నిజానికి గవర్నర్ ది నామమాత్రపు అధికారమే. నిజమైన అధికారం అంతా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. అసెంబ్లీ ని సమావేశపరచడం, ప్రొరోగ్ చేయడం నుంచి, మంత్రుల్ని బర్తరఫ్ చేయడం వరకు అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి సలహా మేరకు తీసుకోవాలే తప్ప, స్వంత విచక్షణ తో కాదు. అయితే ఆయన స్వంత విచక్షణ ఉపయోగించే సందర్భాలు కొన్ని ఉన్నాయి. కొన్ని బిల్లులు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉన్నపుడు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలన కి పంపే అధికారం అలాంటి వాటిలో ఒకటి. అలాగే ప్రభుత్వ ఏర్పాటు కి ఏ పార్టీని లేక ఏ నాయకుణ్ణి అహ్వానించాలనేది ఇంకొకటి. సరిగ్గా ఈ రెండో అధికారమే శశికళ విషయం లో గవర్నర్ ఉపయోగించారు. ఆమె ముఖ్యమంత్రి అవ్వకుండా ఉండటానికి ప్రధాన కారణం విద్యాసాగర్ రావు ఆమె ని ప్రమాణ స్వీకారం చేయకుండా చేసిన తాత్సారమే. అయితే గవర్నర్ హోదా లో ఆయన తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదమూ, ప్రజామోదమూ లభించింది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న గవర్నర్ ప్రజామోదమో కేంద్ర ఆమోదమో ముఖ్యమా లేక రాజ్యాంగానికి లోబడి ఉండటం ముఖ్యమా అనేది. తమిళనాడు లో సంక్షోభ సమయం లో గవర్నర్ ముంబై నుండి కేవలం అప్పుడప్పుడు మాత్రమే చెన్నై కి రావడం, వచ్చినపుడు కూడా కేంద్ర ప్రభుత్వ అభీష్టం మేరకు మాత్రమే నడుచుకుంటున్నాడన్న అభిప్రాయం కలిగించడం రాజ్యాంగ నిపుణులలో మరొక సారి గవర్నర్ అధికార పరిమితుల గురించి చర్చ కి కారణమైంది.
ఇపుడు మరోసారి అలాంటి చర్చే జరుగుతోంది. గత అవిశ్వాస తీర్మానం జరిగి ఆర్నెల్లు దాటింది కాబట్టి మరొకసారి అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు డిఎంకే కి ఉంది. అదే విషయమై గవర్నర్ ని కలిస్తే దానికి అనుమతించకుండా ఇప్పుడు అవిశ్వాస తీర్మానమే అవసరం లేదన్నట్టు చెప్పడం తో డిఎంకె రాష్ట్రపతి ని కలవనుంది. రాష్ట్రపతి కూడా అనుమతించకపోతే తాము కోర్టుకి వెళతామని స్టాలిన్ అంటున్నారు. నిజానికి రాష్ట్రపతి, గవర్నర్ అనుమతించకపోతే కోర్ట్ కూడా వాళ్ళతో విభేదించే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువే. గవర్నర్, రాష్ట్రపతి , స్పీకర్ విచక్షణాధికారాలని కోర్ట్ ప్రశ్నిచజాలదు. రోజా, స్పీకర్ విషయం లో కోర్ట్ కి వెళితే ఎలాంటి తీర్పు వెలువడిందో అందరం చూసాం. కాబట్టి ఈ విషయం లో కూడా కోర్ట్ మ్యాగ్జిమం, మరొకసారి గవర్నర్ ని కలవమని సూచించే అవకాశం మాత్రమే ఉంది. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. గవర్నర్, రాష్ట్రపతుల నిర్ణయాలు రాజకీయాతీతంగా ఉండాలని ఆశించే ప్రజలు, అలా జరక్కపోతే ఆ ప్రతాపం ఆ నిర్ణయాలవల్ల లబ్ది పొందిన పార్టీల మీద చూపిస్తారు. గవర్నర్ గారికి కానీ, బిజెపి కి కానీ ఇవి తెలియని విషయాలు కావు. కానీ ఇప్పటికిప్పుడు అవిశ్వాస తీర్మనం నెగ్గి ప్రభుత్వం కూలిపోతే తన స్వంత ప్రయోజనాలకి నష్టం అని బిజెపి భావిస్తుండవచ్చు. అయితే గవర్నర్ నిర్ణయాలు వీటి ఆధారంగా జరగకూడదు. శశి కళ విషయం లో గవర్నర్ నిర్ణయానికి కేంద్రం తో పాటు ప్రజామోదమూ ఉంది. కానీ అవినీతిలో కూరుకుపోయిన అనా డిఎంకె ని కాపాడే ఈ నిర్ణయానికి ప్రజామోదమూ లేదు. నిజానికి గవర్నర్ నిర్ణయం కేంద్రాభీష్టమూ, ప్రజామోదం మీద ఆధారపడి కాక కేవలం రాజ్యాంగానికి లోబడే ఉండాలి. పైగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఎటువంటి కారణాలూ చెప్పనవసరం లేదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. మరి అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించకుండా ఉండటానికి కారణాలు చెప్పడం ఎంతవరకు సబబు. ఏది ఏమైనా అవిశ్వాస తీర్మానం పెట్టకుండా స్టాలిన్ ని ఆపడం సాధ్యం కాదు. కానీ దాన్ని కొంత ఆలస్యం చేసి అంతలోపు అన్నాడిఎంకె వ్యవహారాలో బిజెపి వ్యవహారా లో చక్కబెట్టుకుని అంతా సన్నద్దమయ్యాక, వ్యూహాలు సిద్దం చేసుకున్నాక అనుమతించొచ్చని కేంద్రం భావిస్తోందన్న సంకేతాలు మాత్రం ప్రజల్లోకి వెళ్ళాయి.
గవర్నర్ హోదా కి, ఆ పదవికి భంగం కలిగించకుండా ఆయా వ్యక్తులు ఆ పదవి ని నిర్వహించాలని ప్రజలూ, రాజ్యాంగవేత్తలూ భావిస్తారు. కేంద్రానికి లోబడి కాకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేసేలా గవర్నర్ వ్యవస్థ ని ప్రక్షాళణ చేయాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడతారు. ఇవి తెలిసే, కేంద్ర ప్రభుత్వాలు సర్కారి కమీషన్, పూంచ్ కమీషన్ లాంటి కమీషన్ లు వేస్తారు. కానీ వాటి నివేదికలు వచ్చాక మాత్రం ఆ సూచనలని అమలు చేయరు. కారణం అలా అమలు చేస్తే- రాష్ట్రాలని తమ చెప్పుచేతల్లో ఉంచుకునే అవకాశాన్ని అవి కోల్పోతాయి కాబట్టి. అయితే ఇవే పార్టీలు ప్రతిపక్షం లోకి వచ్చాక ఆ నివేదికలని అమలు చేయాలని గగ్గోలు పెట్టడం ఒక కొసమెరుపైతే, తమిళనాట ఈ తరహా డిబేట్ కి కారణమైన ఇద్దరు గవర్నర్లూ తెలుగు వాళ్ళు కావడం రెండవ కొసమెరుపు.
ఇదండీ భారత దేశం లో గవర్న(రీ)మెంటు విధానం!!!
-జురాన్