పొగాకు ఉత్పత్తుల మీద హెచ్చరికల బొమ్మ వేసినా కూడా వ్యతిరేకతే! దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు వినతులు! దేశంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రాగలిగితే చాలు ఏ పనినైనా సానుకూలం చేసుకోవచ్చుననుకునే దుర్మార్గమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయనడానికి ఇది మరొక నిదర్శనం. సిగరెట్ పెట్టెల మీద, పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ హెచ్చరిస్తూ ప్రకటనలు నిర్దిష్ట సైజులో ముద్రించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ హెచ్చరికల ద్వారా పొగతాగే దురలవాటు ఉన్న వారిలో పునరాలోచన కలిగేలా చేయాలని, అప్పటికైనా క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలకు కారణమైన ఈ వ్యసనాన్ని కొంతమేర దూరం చేయవచ్చునని ప్రభుత్వ ఆలోచన.
అయితే ఈ హెచ్చరికలు కూడా నామమాత్రం చేసేయడానికి ఇప్పుడు కార్పొరేట్ కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ హెచ్చరికల వలన అంతో ఇంతో సిగరెట్ కంపెనీలకు నష్టం జరుగుతుంది. వారి బిజినెస్ కాస్త దెబ్బతింటుంది. అయితే వారు నేరుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే వ్యాపార ప్రయోజనాల కోసం చేసినట్లుగా ఉంటుంది గనుక.. ఇప్పుడు రైతుల ముసుగులో ఈ హెచ్చరికలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీనుంచి పొగాకు ఉత్పత్తుల మీద హెచ్చరికలకు సంబంధించిన బొమ్మ పరిమాణం 85 శాతం ఉండాలంటూ కేంద్రం నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు బీడీ పరిశ్రమను సర్వనాశనం చేసేస్తాయని ఒకవైపు ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. తాజాగా పొగాకు రైతుల సంఘాల సమాఖ్య కూడా ఇదే విజ్ఞప్తితో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నది. బ్యాంకురుణాలు ప్రమాదంలో పడతాయని, తెలుగు రాష్ట్రాల్లోనే 1200 కోట్ల పొగాకు పంట వృథాగా ఉన్నదని ఈ సమాఖ్య వారు చెబుతున్నారు.
అయితే పేరుకు రైతులు పోరాడుతున్నా.. వాస్తవానికి వీరి వెనుక నుంచి సిగరెట్ కంపెనీలే దీన్ని నడిపిస్తున్నాయని అందరికీ తెలిసిన సంగతే. ప్రభుత్వ హెచ్చరికల నిర్ణయానికి వ్యతిరేకంగా సిగరెట్ కంపెనీలు ఉత్పత్తిని నిలిపేశాయి. దీంతో రైతులపై ఒత్తిడి పెరుగుతోందని సమాఖ్య వాదిస్తున్నది. అయితే ప్రభుత్వం వీరి డ్రామాలకు తలొగ్గకుండా కాస్త దృఢంగా వ్యవహరించినట్లయితే.. ఉత్పత్తిని నిలిపేసి ఎంతోకాలం మనలేని సిగరెట్ కంపెనీలు తిరిగి దార్లో పడతాయని పలువురు సూచిస్తున్నారు. మరి మోడీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.