కన్న కూతురికి అన్యాయం జరిగితే న్యాయం కోసం ప్రతి తండ్రి పోరాడుతున్నాడా? ఈ దేశంలో ప్రతి 20 నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ 90శాతం అసలు కేసులే రిజిస్టర్ కావడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు? అత్యాచార కేసుల్లో న్యాయం అవసరం లేదా? తమపై అత్యాచారం జరిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడాన్ని ఎందుకు అవమానంగా, అగౌరవంగా భావిస్తున్నారు? ఈ దేశంలోని చాలా గ్రామాల్లో అమానుషమైన ఘటన జరిగితే, జరిగిన అన్యాయం కంటే ఇంకా అన్యాయమైన తీర్పులు ఇచ్చే దుర్మార్గమైన సాహసానికి గ్రామపెద్దలు వడిగడుతుంటే దాన్ని ప్రశ్నించే వ్యవస్థ లేదా? ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీ చిత్రం చూస్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమౌతాయి. నిషా పహుజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఎ టైగర్’ ఈ ఏడాది ఆస్కార్ కి నామినేట్ అయిన డాక్యుమెంటరీ చిత్రాల్లో ఒకటి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ వేదికలో విడుదలైయింది.
2013లో జార్ఖండ్‌లోని బెరో జిల్లాలో వెలుగు చూసిన క్రూరమైన సామూహిక అత్యాచార ఘటన అందరినీ కలిచివేసింది. పదమూడేళ్ల బాలికపై ముగ్గురు దుండగులు చేసిన అమానుష అత్యాచార దాడి మానవత్వంపై మాయని మచ్చగా మిగిలింది. ఈ దుండగుల్లో ఒకడు ఆ బాలిక బంధువు కావడం ఇంకా దుర్మార్గం. ఈ ఘటనలో బాలిక తండ్రి రంజిత్, గ్రామ పెద్దలని, ప్రజలని ఎదురించి చేసిన న్యాయపోరాటాన్ని ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీలో చిత్రీకరించారు నిషా పహుజా. బాలిక కుటుంబం, ఆ గ్రామం తీరు, నిందితులు, ‘శ్రీజన్’ అనే ఎన్జీవో చేసిన సాయం, బాలిక తండ్రి చేసిన న్యాయపోరాటం.. ఇలా నాలుగు కోణాల్లో ఈ డాక్యుమెంటరీ నడుస్తుంది.
తన కూతురికి అన్యాయం జరిగితే న్యాయం కోసం ప్రతి తండ్రి పోరాటం చేస్తాడు. కానీ ఇక్కడ రంజిత్ పరిస్థితులు వేరు. తను ముగ్గురు ఆడపిల్లకు తండ్రి. చాలా అమాయకుడు. వ్యవసాయం అతడి జీవనోపాధి. రెక్కల కష్టంతో పిల్లలకి కడుపునింపడం తప్పితే తనకు మరో ప్రపంచం తెలీదు. తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని గ్రామ పెద్దలతో మొరపెట్టుకుంటే.. అత్యాచారం చేసినవాడే పెళ్లి చేసుకుంటాడని, దీంతో ఆ మచ్చ తోలిగిపోతుందని ఓ దుర్మార్గమైన తీర్పు ఇస్తారు. అసలు అమ్మాయికి రాత్రి సమయంలో అక్కడేం పని? తన అజాగ్రత్త వలనే ఇదంతా జరిగిందని, ఈ విషయంలో కేసులు పెడితే… గ్రామానికి చెడ్డపేరు వస్తుందని ఆ గ్రామంలో మహిళలు సైతం అభిప్రాయపడతారు. ఇవన్నీ చూస్తుంటే ఆ గ్రామం ఎంత అంధకారంలో వుందో అర్ధం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులని ఎదుర్కొని రంజిత్ చేసిన పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకంగానే వుంటుంది.
అన్యాయానికి గురైన బాధితుల మానసిక సంఘర్షణ ఎలా వుంటుందో వున్నది వున్నట్లుగా చూపించారిందులో. అన్యాయానికి గురైనవారే ఏదో తప్పు చేశారనే కోణంలో చూసే చూపులు, బాధితులే తలదించే పరిస్థితులు రావడం నిజంగా చాలా దారుణం. రంజిత్ కుటుంబానికి ఈ అవమానాలతో పాటు గ్రామస్తుల నుంచి భయం వెంటడూతూ వుంటుంది. కేసు పెట్టాడనే కోపంతో ఎప్పుడు ఎవరు ఎలా దాడి చేస్తారో తెలియని భయంతో బతుకుతుంటారు. కొన్ని రోజులు రంజిత్ నిద్రపోకుండా కుటుంబాన్ని కాపలా కాస్తే ఇంకొన్ని రోజులు అతని భార్య నిద్రలేని రాత్రులు గడిపి ఒక పక్షి తన పిల్లల్ని రెక్కల్లో పెట్టి రక్షించినట్లుగా ఆ పిల్లల్ని కాపాడుకునే పరిస్థితులు చూస్తున్నపుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగేస్తాయి.
ఈ కేసులో రంజిత్ కుటుంబానికి స్థానికంగా వున్న శ్రీజన్ ఫౌండేషన్ చేసిన సాయం మానవత్వం ఎక్కడో చోట బతికుందనే నమ్మకం కలిగిస్తుంది. వారి సాయంతో ఈ కేసులో బలంగా నిలబడతాడు రంజిత్. నిజానికి రంజిత్ పోరాటంలో మొదట్లో అంత సీరియస్ నెస్ వుండదు. దీనికి కారణం వుంది. అసలు తనకు కోర్టులు, కేసులు అంటే ఏమిటో తెలీదు. రెండు మూడు సార్లు వాయిదాలకి సమయానికి హాజరుకాలేకపోతాడు. తర్వాత కొంచెం కొంచెం అతనికి కోర్టు పరిస్థితులు తెలుస్తాయి. ముడుపులు ఇవ్వకపోతే గుమస్తా కూడా సరిగ్గా స్పందించడని తెలుసుకొని అప్పు చేసి మరీ కేసులో నిలబడతాడు. ట్యాక్సీలు బుక్ చేసి గ్రామ పెద్దలని సాక్ష్యానికి తీరుసురావడం, నెలలు తరబడి కోర్టులు చుట్టూ తిరగడం.. ఇవన్నీ చూస్తున్నపుడు.. ఈ దేశంలో న్యాయం ఎంత ఖరీదైనదో అంతర్లీనంగా అర్ధమౌతుంటుంది. ఇలాంటి కేసుల్లో కూడా న్యాయస్థానాలు యుద్ధప్రతిపాదికన ఎందుకు స్పందించవనిపిస్తుంటుంది.
రంజిత్ కంటే తన కూతురు ఈ కేసులో బలంగా నిలబడింది. నిజానికి తండ్రికి ఆ చిన్న పాపే పోరాట స్ఫూర్తిని ఇస్తుంది. తండ్రి బిడ్డల మధ్య చాలా మంచి అనుబంధం వుంటుంది. ఆ అమ్మాయి మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా వినిపిస్తుంటాయి. గ్రామస్తులంతా తననే నిందిస్తుంటే ఒక దశలో తనే తప్పు చేశానా? అనే మానసిక క్రుంగుబాటుకు గురైన పరిస్థితి చూసినప్పుడు.. ఆ గ్రామం మీద అక్కడి మనుషుల మధ్య ఒకరకమైన ఆగ్రహం కలుగుతుంది. ఆ అమ్మాయి కోర్టుకు వచ్చిన దృశ్యాలు చూసినప్పుడు.. నిజంగా అందరూ ఇంత ధైర్యంగా నిలబడితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే ఆలోచన కలుగుతుంది. తను కోర్టులో సాక్ష్యం చెప్పిన తర్వాత ‘నాకిది ఫైనల్ ఎగ్జామ్ లా అనిపించింది నాన్న’ అని తండ్రితో అన్నప్పుడు అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేస్తాయి. 14 నెలలు విచారణ తర్వాత ముగ్గురు నిందితులకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది స్థానిక కోర్టు. ఆ తీర్పు విన్న రంజిత్ కూతురుకి ఫోన్ చేసి ’’అమ్మా.. మనం కేసు గెలిచాం. ఈ విషయం ఎవరికీ చెప్పకు’’ అంటాడు. ఈ మాటలు విన్నప్పుడు రంజిత్, అతని కుటుంబం, అతని పోరాటం ఎలాంటి పరిస్థితుల నేపధ్యంలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
దర్శకురాలు నిషా పహుజా, మానవహక్కుల కమీషన్ అనుమతితో నిజ జీవిత పాత్రలతోనే ఈ డాక్యుమెంటరీని తీశారు. తన అభిప్రాయం కాకుండా వున్నది వున్నట్లుగానే అక్కడి గ్రామస్తులు, రంజిత్ కుటుంబం మనోభావాలని చిత్రీకరించారు. రంజిత్ కల్మషం లేని మాటలు గుర్తుండిపోతాయి. రెండు రిబ్బన్ జడలతో అమాయకంగా కనిపించే ఆ పాప చూపులు వెంటాడతాయి. తను కోర్టులో సాక్ష్యం చెప్పే దృశ్యాన్ని నీలి నీడలు కమ్ముకున్న మేఘాలతో దర్శకురాలు చిత్రీకరించిన తీరు సృజనాత్మకంగా వుంది. జోనాథన్ గోల్డ్ స్మిత్ నేపధ్య సంగీతం కథనాన్ని పట్టుతో నడిపించింది. మృణాల్ దేశాయ్ కెమరాపనితనం చాలా సహజంగా వుంది. దేశాన్ని కుదిపేసిన ఘటనని ఎక్కడా సంచలనాలకు తావులేకుండా చాలా సాదాసీదాగా చిత్రీకరించిన తీరు బావుంది. దాదాపు రెండు గంటల పదినిమిషాల నిడివి గల డాక్యుమెంటరీ. కొన్ని రిపీట్ అనిపించే సన్నివేశాలు కూడా వున్నాయి. ముఖ్యంగా గ్రామస్తుల అభిప్రాయ సేకరణని పదేపదే ఒకే విషయాన్ని కమ్యునికేట్ చేసేలా రిపీటెడ్ గా చూపించారు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది.
‘పులిని వంటరిగా చంపలేం’ అని రంజిత్ తో ఎవరో అన్నారట. కానీ తాను చంపి చూపించానంటాడు రంజిత్. ఇక్కడ పులి అంటే భయం కావచ్చు, జయించలేని యుద్ధం కావచ్చు. అలాంటి భయాన్ని, యుద్ధాన్ని జయించాడు రంజిత్.