తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో జోష్ మీద ప్రకటనలు చేస్తున్నారు. గతంలో కరీంనగర్‌ను లండన్ చేస్తామని.. వరంగల్‌ను డల్లాస్ చేస్తామని.. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తామనే ప్రకటనలు చేశారు. వాటిపై ప్రతిపక్షాలు తరుచూ విమర్శలు చేస్తూ ఉంటాయి. అలా అసెంబ్లీలోనూ విమర్శించే సరికి సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామనడంలో తప్పు లేదని, ఇస్తాంబుల్‌గా కావాలని కోరుకోవద్దా? ఇది కూడా అనుకోవద్దా? కలలు కనొద్దా? అని సీఎం ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
హైదరాబాద్‌ను గొప్పగా తీర్చిదిద్దుకుంటే రాష్ట్రం ప్రతిష్ఠ పెరుగుతోందన్నారు. అయితే కరీంనగర్‌ను డల్లాస్ చేస్తామని చెప్పలేదని స్పష్టంచేశారు. కరీంనగర్ పక్కనే నది, కాలువలు అందంగా ఉంటాయని.. వాటిని సుందరంగా తీర్చిదిద్దుకుంటే కరీంనగర్ డల్లాస్‌గా కనిపిస్తుందని మాత్రమే చెప్పానన్నారు. అలా చెప్పడం తప్పా? అని విపక్షాలను ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని బాగు చేయాలంటే రూ. 15 వేల కోట్లు కావాలని అధికారులు చెప్పారన్నారు. అందుకే ఒక్క రోజులో అయ్యే ప ని కాదన్నారు. పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా రూ.1,200 కోట్లతో నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.