టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను పోలీసులు ఓ శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని కోర్టు సమయం ముగిసిన తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అప్పటికప్పుడు బెయిల్ రావడానికి అవకాశం లేకుండా పోయింది. అందతా ప్లాన్ ప్రకారమే చేశారని… ఆయనను జైల్లో పెట్టాలన్న లక్ష్యం నేరవేర్చుకోవడానికి చేశారని.. రవిప్రకాష్ వర్గీయులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో అసలు రవిప్రకాష్‌పై కొత్తగా పెట్టిన కేసుల్లో ఎంత డొల్లతనం ఉందో.. వెల్లడిస్తున్నారు.
ఉద్యోగులందరికీ బోనస్‌లు ..! బ్యాలెన్స్ షీట్లే సాక్ష్యం..!
టీవీ9 యాజమాన్య సంస్థ ఏబీసీఎల్ గత పదేళ్ల నుంచి ఉద్యోగులకు బోనస్‌లు చెల్లిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చానల్‌ను.. కొన్నాళ్ల పాటు బ్యాన్ చేశారు. ఈ కారణంగా 2014లో మాత్రమే బోనస్ చెల్లించలేదు. అప్పుడు మినహా ప్రతి ఏడాది ఉద్యోగులకు బోనస్ కం ఎక్స్‌గ్రేషియా పేరుతో చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ బ్యాలెన్స్ షీట్లలోనే పొందు పరిచారు. రవిప్రకాష్‌తో పాటు సీఎఫ్‌వో మూర్తి, డైరక్టర్ క్లిఫర్డ్ ఫెరీరాలకు కూడా బోనస్ వచ్చింది. ఫెరీరా ఇప్పటికీ డైరక్టర్ బోర్డులో కొనసాగుతున్నారు. ఆయన అక్రమంగా బోనస్ పేరుతో డబ్బులు మళ్లించుకుంటే బోర్డులో ఇప్పటికీ ఎలా ఉంటారు..? ఆయనపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు…? తన ఖాతాలో తనకు తెలియకుండా డబ్బులు పడ్డాయని ఆయన వాదిస్తారా..? . నిజానికి మూర్తి కన్నా… ఫెరీరానే ఎక్కువ బోనస్ అందుకున్నారు. ఈ బోనస్ 2018 నుంచి మూడు ఇన్స్టాల్మెంట్లలో చెల్లించారని.. ఏబీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి.
బోర్డు లేకుండా బోనస్ ఇవ్వడానికి బోర్డు పర్మిషన్ ఎలా తీసుకుంటారు..?
బోర్డు అనుమతి లేకుండా బోనస్ పేరుతో రవిప్రకాష్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నాడనేది అలంద మీడియా చేసిన ప్రధానమైన ఆరోపణ. దీనిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి అలంద మీడియాకు చెందిన డైరక్టర్ల బోర్డు మే 8, 2019 మాత్రమే ఎన్సీఎల్టీ, ఎంఐబీ అనుమతి పొందింది. అంటే.. అధికారికంగా అలంద మీడియా బోర్డు అప్పుడు మాత్రమే ఉనికిలోకి వచ్చింది. కానీ బోనస్‌ల నిర్ణయం… అంతకు ముందే జరిగింది. నిధులు కూడా అలంద మీడియా బోర్డు ఏర్పడక ముందే ఇచ్చారు. అలాంటప్పుడు… రవిప్రకాష్.. కాలానికంటే ముందుకు వచ్చి .. బోర్డు నిర్ణయం ఎలా తీసుకుంటారు..? జరిగినపోయిన దానికి .. కొత్తగా వచ్చిన బోర్డు.. తమ నిర్ణయం తీసుకోలేదని ఎలా ఫిర్యాదు చేస్తుంది..?
సంతకం లేకుండా ఫిర్యాదు..! పోలీసుల దూకుడు..!
సెప్టెంబర్ నాలుగో తేదీన ఫిర్యాదు చేసినట్లుగా… పోలీసులకు అలందరి మీడియా ఇచ్చిన కంప్లైంట్ లెటర్లో ఉంది. దానిపై ఎలాంటి సంతకం లేదు. అందులో సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన జరిగిన బోర్డు మీటింగ్‌లో హఠాత్తుగా.. ఈ బోనస్‌ల అక్రమాలు కనుక్కొన్నట్లుగా పేర్కొన్నారు. అంటే… తాము సెప్టెంబర్ 24వ తేదీన బోర్డు మీటింగ్ జరుపుతామని… అందులో రవిప్రకాష్ అక్రమాలు కనిపెడతామని.. సెప్టెంబర్ నాలుగో తేదీనే వారికి తెలిసిపోయింది. అందుకే.. ఆ రోజునే ఫిర్యాదు చేసి…. తమకు తెలిసినట్లుగా సెప్టెంబర్ 24వ తేదీన బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు. అంతేనా … బంజారాహిల్స్ పోలీసులు అంత కంటే వేగంగా ఉన్నారు. ఓ ఆర్థిక అవకతవకల వ్యవహారంగా పేర్కొంటున్న విషయాన్ని పద్దెనిమిది గంటల్లో ఎలా దర్యాప్తు చేశారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. బ్యాంక్ ఖాతాలను పరిశీలించడానికే… రెండు, మూడు రోజులు పడుతుంది. టీవీ9 గ్రూపులో కొన్ని వేల మంది ఉద్యోగులున్నారు.
చట్టం ప్రకారం అది క్రిమినల్ కేసు ఎలా అవుతుంది..?
సాధారణం వ్యాపార సంస్థల్లో జరిగే ఆర్థిక లావాదేవీలు.. ఇతర వివాదాలు… ప్రైవేటు మ్యాటర్ అవుతుంది. ఇంకా పెద్ద నేరంగా భావిస్తే.. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు కానీ.. క్రిమినల్ కేసు మాత్రం కాదు. పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పులు చెప్పింది. అయితే బంజారాహిల్స్ పోలీసులు మాత్రం… వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే… ఇదే అలంద మీడియా గతంలో పెట్టిన కేసుల్లో రోజుమార్చి రోజు.. రవిప్రకాష్ కోర్టు ముందు హాజరవుతున్నారు. అలాంటప్పుడు… ఉన్నపళంగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. చట్టం ప్రకారం.. 21 రోజుల గడువుతో నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రవిప్రకాష్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్న లక్ష్యంతోనే… అలంద మీడియా .. తన అధికార బలంతో.. ఈ విధంగా చేస్తోందన్న అభిప్రాయం… ఆయన వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.