రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఆరుగురు సభ్యులున్నారు. వారిలో ఒకరు ధర్మపురి శ్రీనివాస్. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారో లేదో కానీ.. రాజకీయ చక్రబంధంలో మాత్రం ఇరుక్కున్నారు. అటు టీఆర్ఎస్ నేతనని చెప్పుకోలేక.. ఇటు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నానని ధైర్యంగా ప్రకటించుకోలేక సతమతమైపోతున్నారు. ఈ క్రమంలో డీఎస్‌కు ఓ చాన్స్ వచ్చింది. అదే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజ్యసభలో ఒక్క ఓటు కూడా అత్యంత విలువైనదిగా మారింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పక్షాల మధ్య నెంబర్ గేమ్ నడుస్తోంది. బీజేపీతో మొదటి నుచి టీఆర్ఎస్ లోపాయికారీగా అయినా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి రాజ్యాంగ పదవులకు మద్దతు ప్రకటించింది.ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడుతున్న జేడీయూ ఎంపీ హరివంశ్‌కు మాత్రం మద్దతు ఇంకా మద్దతు ప్రకటించలేదు. పార్టీలో చర్చించి చెబుతామని తనకు ఫోన్ చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు కేసీఆర్ చెప్పారు.
టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వారికి … డీఎస్ ఓటు వేస్తారా లేదా అన్నది ఇప్పుడు తెలంగాణతో పాటు.. ఢిల్లీలోనూ హాట్ టాపిక్ అయింది. తనపై కోపంతో తన కుమారుడ్ని లైంగిక వేధింపుల కేసుల్లో ఇరికించి.. నిర్భయ కేసు పెట్టి వేధిస్తున్నారని డీఎస్ మథన పడుతున్నారు. కుమారుడి కోసం అయినా కేసీఆర్ తో రాజీ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ వ్యూహం కూడా ఇదేనని.. అందుకే హఠాత్తుగా కేసులు బయటకు వచ్చాయన్న ప్రచారం కూడా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో డీఎస్ తమ మాట వినడానికే.. టీఆర్ఎస్ ముందస్తుగా ఇలాంటి ప్లాన్ చేసిందనే వాళ్లు కూడా ఉన్నారు. అందుకే సంజయ్… కోసం ఆరు బృందాలు గాలిస్తున్నాయని చెబుతున్నారు కానీ… అరెస్ట్ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
డీఎస్ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. గతంలో తనకు సన్నిహితులైన… గులాంనబీ ఆజాద్ లాంటి వాళ్లతో కూడా.. ఆయన చర్చలు జరిపినట్లు మీడియా వెల్లడించింది. అదే నిజమైతే.. డీఎస్ కాంగ్రెస్ పార్టీ … మద్దతుతో నిలబడే… అభ్యర్థికి డీఎస్ ఓటు వేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ టీఆర్ఎస్ నేతలు డీఎస్.. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటారన్న నమ్మకంతో ఉన్నారు. తన కుమారుని వివాదం బయటకు వచ్చిన తర్వాత కూడా.. డీఎస్ తన స్పందన వ్యక్తం చేయలేదు. సైలెంట్‌గానే ఉన్నారు. అందుకే డీఎస్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.