రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. ఇది ఈ రోజు మరోసారి నిరూపితమవుతుంది. దశాబ్దాల పాటు.. వ్యతిరేక పార్టీలుగా మెలిగిన.. కాంగ్రెస్, టీడీపీ ల అధ్యక్షుడు.. ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ ఉదయం కోడంగల్‌లో ఎన్నికల బహిరంగసభలో ప్రసంగించి.. మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం గొల్లగూడం చేరుకుంటారు. ఖమ్మంలోని ఎస్పీ స్టేడియంలో ప్రజా కూటమి బహిరంగసభలో పాల్గొంటారు. ఈ మీటింగ్‌లోనే రాహుల్‌తో కలిసి.. ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇదే వేదికపై ఈ ఇద్దరు నేతలు ప్రసంగిస్తారు. తర్వాత హైదరాబాద్‌లో సాయంత్రం 5.30 గంటలకు సనత్‌నగర్ సత్యం థియేటర్ బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నాంపల్లి నియోజకవర్గం అసిఫ్ నగర్లో చంద్రబాబు, రాహుల్ రోడ్ షో నిర్వహిస్తారు.
తెలంగాణలో రెండో రోజు కూడా రాహుల్ పర్యటన కొనసాగనుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భూపాలపల్లి బహిరంగ సభలో… సాయంత్రం 5 గంటలకు పరిగి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చెవెళ్లలో ప్రచారం చేసి ఢిల్లీ వెళ్తారు. గురువారం కూడా చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. కూకట్పల్లి, శేరిలింగంపల్లిలలో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహిస్తారు.
పోలింగ్ తేదీ సమీపించడంతో కీలక నేతలు రంగంలోకి దిగడంతో సీన్ మారుతుందని ప్రజాకూటమి నేతలు బావిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, రాహుల్ గాంధీ సభలు ప్రజాకూటమికి ఉత్సాహం ఇవ్వనున్నాయి. ప్రచార తేదీలు దగ్గర పడే సమయంలో.. మరోసారి. .ఇద్దరూ కలిసి ప్రచారం చేసే అవకాశం ఉంది.