దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ‘సితార’ సినీ వార పత్రికది. ‘ఈనాడు’ సంస్థల్లో సితార కూడా ఒకటి. రామోజీ రావు మాసన పుత్రికగా సితారని పేర్కొంటారు. అలాంటి సితార వార పత్రికకు ‘శుభం’ కార్డు పడింది. గత కొన్నేళ్లుగా సితారని మూసేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే నిజమైంది. ‘సితార’ ఆఖరి పత్రిక ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఇకపై ‘సితార’ రాదు. వార పత్రిల్లో సితార స్థానం సుస్థిరం. జ్యోతి చిత్ర లా ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, సినిమా పరిజ్క్షానాన్ని పాఠకులకు అందిస్తూ తన ప్రత్యేకత చాటుకుంది సితార. ఏ వార పత్రిక తిరగేసినా సినిమాల తాలుకూ,యాడ్లే కనిపిస్తాయి. సితార మాత్రం… కావల్సినంత సమాచారం, కావల్సిన మేరకు అందిస్తూ వచ్చింది. వార పత్రికలకు కాలం చెల్లిపోవడంతో పాటు ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ అవ్వడం సితారకు శాపంగా మారింది. నిర్వహణా వ్యయం రోజురోజుకీ ఎక్కువవ్వడంతో ‘సితార’ పత్రికను ఆపేస్తూ.. యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఈనాడు’ నుంచే వచ్చే విపుల, చతురల పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది. వీటిపైనా యాజమాన్యం అతి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఎన్నో యేళ్లుగా పాఠకుల్ని అలరించిన ‘సితార’.. ఇక ముందు కనిపింకపోవడం మాత్రం తీరని లోటే.