తెలంగాణ శాసనమండలి ఈ రోజు ఒక్క రోజు సమావేశం కానుంది. అదీ సంతాపాలు ప్రకటించి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల మరణించిన జాతీయ నేతలతో పాటు కొండగట్టు మృతులకు మండలి తెలుపుతుంది. ఎప్పుడైనా శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయంటే….అసెంబ్లీ, మండలి రెండూ ఒకే సారి భేటీ అవుతాయి. కాని ఈ సారి అసెంబ్లీ రద్దు కావటంతో కేవలం శాసనమండలి సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోపు… చట్టసభలు తప్పనిసరిగా సమావేశం కావాలి. బడ్జెట్ సమావేశాలు మార్చి 29 తో ముగియడంతో ఈనెల 29 లోపు ఖచ్చితంగా సభ నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగానే శాసనమండలి సమావేశం కాబోతోంది.
అసెంబ్లీ రద్దు కావడంతో శాసనమండలిలో చర్చించేందుకు ఎజెండా ఏమీ లేదు. మండలి సమావేశమైన తర్వాత సంతాపాలు ప్రకటించి వాయిదా వేస్తారు ఇటీవల మరణించిన మాజీ ప్రధాని వాజ్ పేయి, డీఎంకే అధినేత కరుణానిధి, మాజీ లోక్ సభ స్పీకర్ సోమ్ నాధ్ చటర్జీ, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరేళ్ల వేణుమాధవ్ తో పాటు కొండగట్టు ప్రమాద మృతులు, గత ఆరు నెలల్లో వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన వారికి సభ సంతాపం తెలపుతుంది. ఆ తర్వాత వాయిదా పడటం లాంఛనమే.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్….ఈ సమావేశాలను ఉపయోగించాలని భావిస్తోంది. ముందస్తు ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నెలకొన్ని సమస్యలపై సభలో నిలదీసేందుకు వాడుకోవాలనుకుంటోంది. అందుకే వారంరోజులైనా సమావేశాలు జరపాలని కోరుతోంది. విభజన హామీల అమలుపై చర్చకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశం ఉంది. కానీ పరిగణనలోకి తీసుకునే పరిస్థితి మాత్రం లేదనేది అందరికి తెలిసిన విషయమే.