హైదరాబాద్: ఇవాళ బాలీవుడ్లో రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి పేరుమోసిన క్రిమినల్ ఛార్లెస్ శోభరాజ్ జీవితం ఆధారంగా తీసిన ‘మై ఔర్ ఛార్లెస్’ కాగా, రెండోది ఢిల్లీ నగరంలోని ఓ సగటు పేద కుటుంబ జీవిత కథాంశంతో తీసిన ‘తిత్లి’. విడుదలకు ముందు ఎంతో సంచలనం సృష్టించిన ‘మై ఔర్ ఛార్లెస్’ పేలవంగా ఉందని, ‘తిత్లి’ చిత్రాన్ని కొత్త దర్శకుడు కాను బెల్ అద్భుతంగా తీశాడని రివ్యూలు వెలువడ్డాయి.
1970, 80 దశకాలలో బీచ్లలో విదేశీ మహిళా టూరిస్ట్లను ట్రాప్ చేసి, రేప్ చేసి హత్యచేసిన ఛార్లెస్ శోభరాజ్ జీవితాన్ని ఆధారంగా ప్రవాళ రామన్ ‘మై ఔర్ ఛార్లెస్’ చిత్రాన్ని రూపొందించారు. పబ్లిసిటీకోసం నేపాల్ జైల్లో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న ఛార్లెస్ శోభరాజ్ వద్దకు వెళ్ళి ఈ సినిమా పోస్టర్ ఒకదానిపై అతని సంతకంకూడా చేయించుకొచ్చారు. రణదీప్ హూడా టైటిల్ పాత్రలో నటించగా, రిచా చద్దా, టిస్కా చోప్రా స్త్రీ పాత్రలలో నటించారు. మంచి కథ అయినప్పటికీ దర్శకుడు దానికి న్యాయం చేయలేకపోయాడని విమర్శకులు రివ్యూలలో పేర్కొన్నారు. అయితే రణదీప్ హుడా మాత్రం టైటిల్ రోల్లో అద్భుతంగా రాణించాడని రాశారు.
మరోవైపు ‘తిత్లి’ చిత్రంపై విమర్శకులు అందరూ ముక్తకంఠంతో ప్రశంశలు కురిపిస్తున్నారు. అంతా బాగుందన్నట్లు ఫీల్ గుడ్ చిత్రాలు తీసే బర్జాత్యా, జోహార్ కుటుంబాల చిత్రాలకు భిన్నంగా ‘తిత్లి’లో దర్శకుడు సగటు జీవితాలలోని నగ్న సత్యాలను ఆవిష్కరించాడంటూ మెచ్చుకుంటున్నారు. ఢిల్లీ నగర శివార్లలో నివసించే తండ్రి, ముగ్గురు అన్నదమ్ముల కథను హృద్యంగా చిత్రీకరించారంటున్నారు. అయితే హింస పాళ్ళు ఎక్కువైందని చెబుతున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు అన్నదమ్ములలో పెద్దవాడిగా నటించిన రణవీర్ షోరే తప్పితే అంతా దాదాపుగా కొత్తవారే.