‘కాపీ కొట్టి ఇంటికెళ్తే అమ్మ అన్నం పెడుతుందా’
‘కాపీ కొడితే.. నాకింతింత పారితోషికాలు ఇస్తారా’
‘కాపీ కొడితే.. నాకొన్ని సినిమాలు వస్తాయా’
అంటూ పాడు లాజిక్కులు తీశాడు తమన్. తనపై కాపీ ముద్ర పడినప్పుడల్లా – తమన్ స్పందించే తీరు ఇలానే ఉంటుంది. `ఒరిజినల్ ట్యూన్ కొట్టి – హిట్ చేసి చూపించండి` అనే సవాళ్లూ… ఎదురవుతాయి. అంటే కాపీ ట్యూన్ అయితే తప్ప, హిట్లు రాలవనే అర్థాలేం వెదుక్కోవాల్సిన అవసరం లేదు గానీ, కాపీ ట్యూనుతో హిట్టు కొట్టడం అంత ఈజీ కాదు అనే విషయాన్ని గ్రహిస్తే సరిపోతుంది.
కాపీ ట్యూను విషయంలో రెండ్రోజుల క్రితమే మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. తనదైన శైలిలో సమర్థించుకున్నాడు తమన్. 48 గంటలు గడవక ముందే.. తనపై మరిన్ని విమర్శలూ, ట్రోల్సూ మొదలైపోయాయి.
క్రాక్ సినిమా కోసం… `మాస్ బిరియానీ` అనే మంచి మాస్ బీట్ కొట్టాడు తమన్. ఈ పాట మాస్ జనాల్ని ఊపేస్తోంది. థియేటర్లలో మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. పాట టీజర్లో రవితేజ, శ్రుతిహాసన్ల స్టెప్పులు సైతం… బాగున్నాయి. అయితే ఇంతలోనే తమన్ పై మరోసారి కాపీ ముద్ర. ఈ పాట గతంలో తాను తీసిన `బలుపు` లోని `వినవే కన్యా కుమారి..` పాటకు డిటో అన్నది జనాలు గ్రహించేశారు. దానికీ తమనే సంగీత దర్శకుడు. అంటే తన పాటను తానే కాపీ కొట్టేశాడన్నమాట. అసలు తమన్ కి మతిమరుపా? లేదంటే.. శ్రోతలు కూడా త్వరగా మర్చిపోయే రకాలు అనుకుంటున్నాడా? అన్నదే అర్థం కాదు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన సంగతేంటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ హీరో రవితేజనే. దర్శకుడు ఒక్కడే. హీరోయిన్ ఒక్కర్తే. సంగీత దర్శకుడు కూడా ఒక్కడే. కాబట్టి ఆ పాటే మళ్లీ కాపీ కొడితే తప్పేముంది? అని ఫీలై ఉంటాడు. మొత్తానికి తమనూ మారలేదు. తనపై ట్రోల్సూ ఆగలేదు.