బైబై అంటూ 2017 వెళ్లిపోతోంది
హలో అంటూ.. కొత్త యేడాది పలకరించబోతోంది.
మరి గతేడాది మనకేమిచ్చింది? ఎన్ని మధురస్మృతులు మిగిల్చింది? ఎంత స్ఫూర్తి రగిలించింది? ఇవన్నీ లెక్కలు వేయాల్సిన తరుణం ఇది.
టాలీవుడ్ చరిత్రలో 2017కి ఉన్న స్థానమేంటి? ఈ యేడాది మనం ఏం నేర్చుకున్నాం? ఏం సాధించాం? అని ఆలోచించాల్సిన సమయం ఇది.
2018కి స్వాగతాలు పలుకుతున్న వేళ.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే….
* మరపురాని విజయాలు
ఏ పరిశ్రమ అయినా ప్రగతి సాధించాలంటే…. విజయాలు అత్యవసరం! చిత్రసీమలోనూ అంతే. విజయం అందించే ఆత్మ విశ్వాసమే వేరు. ఓ సినిమా హిట్టయితే… బోల్డన్ని కొత్త సినిమాల రూపకల్పనకు తెర తీసినట్టే. 2017లోనూ తెలుగు చిత్రసీమ విజయాల్ని చవి చూసింది. అందులో సూపర్ హిట్లున్నాయి, బ్లాక్ బ్లస్టర్లున్నాయి, చరిత్రలో కనీ వినీ ఎరుగని వసూళ్లు సాధించిన చిత్రాలున్నాయి.
సంక్రాంతికి వచ్చిన ఖైది నెం.150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి… సూపర్ హిట్ జాబితాలో చేరిపోయాయి. ఘాజీ, నేనులోకల్, నిన్నుకోరి, నేనే రాజు నేనే మంత్రి, శతమానం భవతి, జై లవకుశ ఇవన్నీ హిట్లుగా నిలబడ్డాయి. ఫిదా, అర్జున్ రెడ్డి.. సంచలన విజయాలు సాధించాయి. గరుడవేగతో రాజశేఖర్ ఓ షాకింగ్ హిట్ కొట్టాడు. రారండోయ్ వేడుక చూద్దాం, రాజా ది గ్రేట్, ఉన్నది ఒకటే జిందగీ ఓకే అనిపించాయి. ప్రతీ సీజన్లోనూ… కొన్ని హిట్లు, యావరేజ్లూ వస్తూ పోతూ ఉన్నాయి. అయితే…. వీటన్నింటికి మించిన విజయం బాహుబలి 2తో దక్కింది. రాజమౌళి సృష్టించిన ఈ క్లాసిక్… బాక్సాఫీసు దగ్గర రూ.2 వేల కోట్ల వసూళ్లు రాబట్టి చరిత్రలో నిలిచిపోయింది.
* కొత్తమ్మాయిల హవా
ప్రతీయేటా కొత్తమ్మాయిలు టాలీవుడ్లో అడుగుపెడుతూనే ఉంటారు. వాళ్లలో నిలిచేది, మలి అవకాశాన్ని దక్కించుకొనేవాళ్లు కొందరే. కానీ 2017 చాలా స్పెషల్ . ఎందుకంటే ఈ యేడాది దాదాపు పదిమంది కథానాయికలు తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారు. ఫిదాతో సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిపోయింది. షాలినీ పాండే (అర్జున్ రెడ్డి), రితికా సింగ్ (గురు), కల్యాణి ప్రియదర్శన్ (హలో), మేఘా ఆకాష్ (లై) ఆకట్టుకున్నారు.
తెలుగు చిత్రసీమకు కథానాయికల కొరత ఎప్పుడూ ఉన్నదే. వీళ్లొచ్చాక ఆ లోటు కాస్త తీరినట్టు కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్లు కూడా ఈ యేడాది బిజీగానే ఉన్నారు. అనుష్క, తమన్నా, కాజల్, సమంత.. వీళ్లంతా మెరిశారు. రకుల్ యేడాదంతా బిజీనే. లావణ్య త్రిపాఠి ఎక్కువ సినిమాలు చేసినా… తనకు విజయాలు దక్కలేదు.
* కల్యాణ వైభోగమే
టాలీవుడ్లో ఈ యేడాది పెళ్లి సందడి అంతగా కనిపించలేదు గానీ…. నాగచైతన్య – సమంతల పెళ్లి మాత్రం వార్తల్లో నిలిచింది. చాలా కాలంగా ప్రేమికులుగా ఉన్న వీరిద్దరూ ఈ యేడాదే ఒక్కటయ్యారు. సమంత పెళ్లికి మీడియా ఇచ్చిన కవరేజీ అంతా ఇంతా కాదు. గోవాలో వీళ్ల పెళ్లి వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో వివాహ విందు కూడా ఘనంగా ఇచ్చాడు నాగార్జున. అన్నీ కుదిరితే అఖిల్ పెళ్లి కూడా ఈ యేడాదే జరగాల్సింది. అయితే… నిశ్చితార్థం జరిగి కూడా ఈ పెళ్లి ఆగిపోయింది. ప్రభాస్ – అనుష్కల పెళ్లి అంటూ ఓ రూమర్ బయటకు వచ్చింది. అది కాస్త తుస్సుమంది. ప్రభాస్ – నిహారికలకు పెళ్లి జరగబోతోందంటూ… గాసిప్ రాయుళ్లు మరో వార్తని వండేశారు. అదీ… పుకారే అని తేలిపోయింది.
* నంది గోల
వివాదాలకు ఈ యేడాది కొదవలేదు. మరీ ముఖ్యంగా.. నంది వ్యవహారం కొంతకాలం మీడియాలో టాప్ స్టోరీగా నిలిచింది. నంది అవార్డుల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని చాలా మంది వాపోయారు. ఫలానా సినిమాకి నంది అవార్డు ఎలా ఇస్తారంటూ మీడియా సాక్షిగా నిలదీశారు. నంది అవార్డులు కాస్త ‘కమ్మ’ అవార్డులుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. ఈ వివాదంతో మీడియాకు కొన్ని రోజుల పాటు ఫుడ్ దొరికినట్టైంది. నంది కంటే గరమ్ గరమ్‌గా సాగిన మరో వ్యవహారం… డ్రగ్స్! సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, వాళ్లంతా విచారణని ఎదుర్కోవడం సంచలనం సృష్టించింది. ఈ జాబితాలో పూరి జగన్నాథ్, రవితేజ, ముమైత్‌ఖాన్ లాంటి వాళ్లు ఉండడంతో కలకలం రేగింది. వీళ్లలో ఎవరో ఒకరు అరెస్ట్ కావడం ఖామనుకున్నారంతా. కానీ… ఎంత గుప్పున రేగిందో.. అంతే చప్పున చల్లారిపోయింది డ్రగ్స్ కేసు. ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం కూడాకొన్నాళ్లు నడిచింది. పవన్‌ని టార్గెట్ చేసిన కత్తి మహేష్ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. అర్జున్ రెడ్డి పోస్టర్ వివాదాల్లో నిలిచింది. వీహెచ్ హనుమంతరావు ఈ పోస్టర్ని చింపేయడం… ఆ సినిమాకి పరోక్షంగా పబ్లిసిటీకి హెల్ప్ అయ్యింది. దువ్వాడ జగన్నాథమ్‌లో ఓ గీతంలోని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వీటికి తోడుగా.. వర్మ ట్వీట్లు ఎప్పటికప్పుడు వేడి వేడి మసాలా వార్తలకు వేదికగా నిలిచాయి.
* బిగ్ బాస్…. బిగ్ ప్లస్
బుల్లి తెర కార్యక్రమాల్లోనే… ఓ సంచలనం బిగ్ బాస్. ఈ తరహా రియాలిటీ షో.. తెలుగులో బహు కొత్త. దానికి తోడు యాంకర్‌గా ఎన్టీఆర్‌ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రెటీల విషయంలో ముందు కాస్త పెదవి విరిచిన వాళ్లు సైతం.. క్రమంగా ఈ షోలో లీనమైపోయారు. వారం వారం రేటింగులు పెరుగుతూ పోయి.. చివరికి టీఆర్పీ రికార్డులన్నింటికీ బద్దలు కొట్టింది. ఎన్టీఆర్ వ్యాఖ్యానం, తన సమయస్ఫూర్తి ఈ షోకి ప్లస్ అయ్యాయి. చాలామంది సెలబ్రెటీలుగా వెలిగిపోయారు. సెకండ్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా?? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరోవైపు రానా కూడా వ్యాఖ్యాతగా మారాడు. తను కూడా తనదైన శైలిలో నెంబర్ వన్ యారీ అనే టీవీ షోని రక్తి కట్టించాడు.
* ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్
స్టార్ ప్రొడ్యూసర్‌గా చలామణీ అవుతున్న దిల్‌రాజుకి 2017 మరపురాని యేడాది. ఈ యేడాది ఆయన్నుంచి ఏకంగా ఆరు సినిమాలు విడుదలయ్యాయి. శతమానం భవతి, నేను లోకల్, ఫిదా, దువ్వాడ జగన్నాథమ్, రాజా ది గ్రేట్, ఎంసీఏ… ఆయన బ్యానర్ నుంచి వచ్చాయి. శతమానం భవతి, ఫిదా సూపర్ హిట్లు. నేను లోకల్ హిట్ జాబితాలో చేరింది. ఎంసీఏకీ గట్టిగా డబ్బులొచ్చాయి. డీజే, రాజా ది గ్రేట్ నిర్మాతగా దిల్‌రాజుని సంతృప్తి పరిచాయి. మొత్తానికి డబుల్ హ్యాట్రిక్ తో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.