‘ఏ పుట్టలో ఏ పాముందో ఎవరూ చెప్పలేరు…’
చిత్రసీమ గట్టిగా నమ్మే సిద్ధాంతం ఇది. ఏ సినిమా ఎప్పుడు క్లిక్ అవుతుందో, ఏ సినిమా ఎప్పుడు ప్రభంజనం సృష్టిస్తుందో, ఏ హీరో ఎప్పుడు రికార్డులు తిరగరాస్తాడో ఎవ్వరూ చెప్పలేరు. అంచనాలు లేని సినిమా వచ్చి.. కోట్లు కొల్లగొట్టిన సందర్భాలెన్నో! చిన్న సినిమానే కదా, అని తేలిగ్గా తీసుకుంటే – రికార్డులు ఊడ్చుకెళ్లిన సంగతులు ఇంకెన్నో. 2018లోనూ అలాంటి మెరుపు తునకలు వచ్చాయి. `ఔరా` అనిపించాయి. పెద్ద సినిమాలకు షాక్ ఇచ్చాయి. అవేంటో ఓసారి రివైండ్ చేసుకుంటే…
ఛలో
2018లో చిన్న సినిమాలకు ‘ఛలో’ రూపంలో మంచి బోణీ లభించింది. ఫిబ్రవరి 2న విడుదలైన చిత్రమిది. నాగశౌర్య కెరీర్లో అతి పెద్ద విజయాన్ని సాధించి పెట్టింది. ఈసినిమాతో తెలుగు సినిమాకు రెండు లాభాలు జరిగాయి. రష్మిక రూపంలో ఓ మంచి కథానాయిక టాలీవుడ్‌కి లభించింది. వెంకీ కుడుముల రూపంలో ఓ దర్శకుడు దొరికాడు. నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థలో రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. నిర్మాతగానూ తొలి అడుగు సక్సెస్‌ఫుల్‌గా వేశాడు శౌర్య. ఈ సినిమాతో తన మార్కెట్ కూడా పెరిగింది.
తొలి ప్రేమ
ఫిబ్రవరి 10న విడుదలైన ‘తొలిప్రేమ’ కూడా… విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయింది. వరుణ్‌తేజ్ ఖాతాలో మరో హిట్ గా నిలిచిపోయింది. వరుణ్ – రాశీఖన్నాల కెమిస్ట్రీ, కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి ఈ కథని నడిపిన పద్ధతి యువతరానికి బాగా నచ్చేశాయి. మల్టీప్లెక్స్‌లలో మరింత ఆదరణ లభించింది. దర్శకుడిగా వెంకీకి మరిన్ని కొత్త అవకాశాలు వచ్చాయి.
అ!
యువ కథానాయకుడు నాని నిర్మాతగా మారి చేసిన సినిమా ఇది. ఓ రకంగా ప్రయోగాత్మక చిత్రం అనుకోవాలి. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ పాటించిన టెక్నిక్ సినీ ప్రేమికులకు షాక్ ఇచ్చింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కించిన సినిమా కావడంతో లక్ష్య ప్రేక్షకులు తక్కువమందే అయినా.. గిట్టుబాటు అయిపోయింది. టాలీవుడ్‌కి ఓ కొత్త తరహా సినిమాని అందించానన్న తృప్తి నానికి దక్కింది.
సమ్మోహనం
క్లాస్ చిత్రాల దర్శకుడిగా ఇంద్రగంటి మోహన కృష్ణ తన పేరునీ, ఇమేజ్‌ని మరింత పదిలపరచుకున్న చిత్రం ‘సమ్మోహనం’. సుధీర్ బాబు, అతిథిరావు హైదరీ జంటగా నటించిన సినిమా ఇది. తనదైన క్లాస్ మేకింగ్‌తో, సున్నితమైన భావోద్వేగాలతో ఈ కథని రక్తి కట్టించాడు దర్శకుడు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు.. బాక్సాఫీసు దగ్గర కూడా మంచి ఫలితాన్ని రాబట్టిన చిత్రమిది.
ఆర్.ఎక్స్ 100
2018లో చిన్న సినిమాల్ని ఓ కుదుపు కుదిపేసిన చిత్రం ‘ఆర్.ఎక్స్ 100’. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దుమ్ము దులిపింది. రూపాయికి పది రూపాయల లాభాల్ని తీసుకొచ్చింది. దర్శకుడిగా అజయ్ భూపతి కి ఇదే తొలి చిత్రం. తన మొదటి అడుగులోనే… తన పంథాని స్పష్టం చేసిన అజయ్… రాబోయే చిన్న సినిమాకి కొత్త మార్గాన్ని చూపించినట్టైంది. ఈ సినిమాతో తెరపై తొలిసారి మెరిసిన పాయల్ ఘోష్‌కి మరిన్ని కొత్త అవకాశాలు వచ్చాయి.
గీతా గోవిందం
ఆగస్టు 15న విడుదలైన చిత్రమిది. చిన్న సినిమాలలో వంద కోట్ల మైలు రాయిని అందుకుని.. టాలీవుడ్ ని ఆశ్చర్యపరిచింది. అప్పటికే అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండని… కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా ఇది. విజయ్ – రష్మికల జంట చూడముచ్చటగా కుదరడంతో పాటు, పరశురామ్ మేకింగ్స్టైల్, సంభాషణల చాతుర్యం.. ఈ కథకు ప్రాణం పోశాయి. సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘ఇంకేం ఇంకేం కావాలే..’ అనే పాట మార్మోగిపోయి.. ఈ సినిమా విజయానికి మరో మూల స్థంభంగా నిలిచింది.
గూఢచారి
జేమ్స్ బాండ్ సినిమాలు తెలుగులో వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. ఇంగ్లిష్ సినిమాలు చూసీ చూసీ అంత స్టైలీష్ మేకింగ్… మనవాళ్లకు రాదేమో అన్న అనుమానాల్ని పటాపంచలు చేసిన సినిమా ‘గూఢచారి’. అడవి శేష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శశి కిరణ్ తిక్క దర్శకుడిగా పరిచయం అయ్యారు. అతి తక్కువ బడ్జెట్‌తో, ఓ సినిమాని ఇంత స్టైలీష్‌గా ఎలా తీశారంటూ.. టాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది. నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా మొదలవ్వనుంది.
టాక్సీవాలా
విడుదలకు ముందే ఈ పూర్తి సినిమా లీకైపోయి.. దర్శక నిర్మాతల్ని భయభ్రాంతులకు గురి చేసింది టాక్సీవాలా. నిజానికి ఈ సినిమాపై ఎవరికీ ఎలాంటి నమ్మకాలూ లేవు. కానీ… అవన్నీ నవంబరు 17న తలకిందులైపోయాయి. అంచనాల్ని తారుమారు చేసి ‘హిట్’ టాక్ అందుకుంది టాక్సీవాలా. 20 కోట్ల మైలు రాయిని అందుకుని… నిర్మాతకు మంచి లాభాల్ని అందించింది. మామూలు ఆత్మకథనే ఓ సైన్స్ ఫిక్షన్‌గా మలచి.. దర్శకుడు విజయం సాధించాడు. ఇప్పుడు టాలీవుడ్ ఈ జోనర్ కథలకు మంచి డిమాండ్ ఏర్పడింది.