సినీ పరిశ్రమకు కొత్త దర్శకుల రాక చాలా ముఖ్యం. సినిమాకి నవ జవసత్వాలు నింపేది యువ దర్శకులే. ఓ కొత్త దర్శకుడు తనదైన మార్క్ తో నిలబడితే సినిమాలు కొత్తపుంతలు తొక్కుతాయి. కథలు చెప్పడంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త దర్శకులపై పెద్ద అంచనాలు వుండవు కనుక వైవిధ్యమైన థీమ్స్, జోనర్స్, ఫిలిం మేకింగ్ లో యూనిక్ స్టయిల్ ని ప్రయత్నించే అవకాశం కూడా వారికే వుంది. ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో కొత్త దర్శకులు సందడి కనిపించింది. పలువురు యువదర్శకులు తమ తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుంటే మరికొందరికి నిరాశ ఎదురైయింది. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
నాగర్జున లాంటి సీనియర్ హీరో ‘నా సామిరంగ’తో ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. కొరియోగ్రఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నారు. పండక్కి వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇదొక రిమేక్ కథ. నాగర్జున ఇమేజ్ కి తగట్టు చేసుకుంటూ వెళ్ళాడు బిన్నీ. దీంతో డైరెక్షన్ లో ఆయన ఒరిజినల్ స్టయిల్ ఏమిటో చూసే అవకాశం రాలేదు. అయితే సినిమాని 70 రోజుల్లో పూర్తి చేసి విడుదల చేసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు బిన్నీ.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు దుష్యంత్ కటికినేని. గీతా ఆర్ట్స్ లాంటి ప్రముఖ సంస్థ బ్యాకింగ్ తో వచ్చిన ఈ సినిమాకి మంచి ప్రమోషన్స్ దక్కాయి. కుల వివక్ష బ్యాక్ డ్రాప్ లో కథని రాసుకున్న దుష్యంత్ సాధ్యమైనంత సహజంగా చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమా బాక్సాఫీసు వద్ద నిలబడలేదు కానీ సీరియస్ ఫిల్మ్ మేకర్ జాబితాలోకి అతని పేరు చేరింది.
‘సిద్ధార్థ్ రాయ్’ సినిమాతో వి. యశస్వి పేరు బాగా వినిపించింది. టీజర్ చూసి తర్వాత అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పోలికలు వచ్చాయి. నిజానికి ఇలాంటి ఫిలాసఫీతో ఓ కథ చెప్పాలని అనుకోవడం కొత్త ప్రయత్నమే, కానీ సినిమా బాక్సాఫీసు ముందు ఆడలేదు. అయితే సుకుమార్ లాంటి దర్శకుడి నుంచి యశస్వికి పిలుపొచ్చింది. ఇప్పుడు సుకుమార్ తో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకొన్నాడు. ఇది నిజంగా గొప్ప ఛాన్సే. ‘సుందరం మాస్టర్’ తో కళ్యాణ్ సంతోష్ మెగాఫోన్ పట్టుకున్నాడు. టీజర్ ట్రైలర్ కంటెంట్ పై ఆసక్తిని పెంచాయి. ఒక కొత్త యాంబియన్స్, బ్యాక్ డ్రాప్ లో కథని సెట్ చేశాడు. అయితే ఆ కంటెంట్ ప్రేక్షకులకి అంత కనెక్ట్ కాలేదు. పురుషోత్తం రాజ్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ` సినిమాతో వచ్చాడు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. బ్యాక్ డ్రాప్ ని కొత్తగానే సెట్ చేశాడు కానీ సినిమాకి క్రౌడ్ ఫుల్లర్ లేకపోవడంతో పెద్దగా దృష్టి ఆకర్షించలేకపోయింది.
‘గామి’తో విద్యాధర్ కాగిత దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కోసం తను పడిన శ్రమ తెరపై కనిపించింది. క్రౌడ్ ఫండింగ్ విధానంలో సెట్స్ పైకి వెళ్ళిన సినిమా నిధులు లేక చాలా కాలం నిలిచిపోయింది. అయితే ఎక్కడా నిరాశ చెందకుండా చాలా ఓపికగా అనేక సినిమా కష్టాలు ఎదుర్కొని పూర్తి చేసి ప్రేక్షకులు ముందుకు తెచ్చారు. సినిమా కమర్షియల్ సక్సెస్ మాట పక్కన పెడితే.. మంచి ప్రయత్నమనే పేరు తెచ్చుకుంది. ఏదైనా కొత్తగా చెప్పాలనే తపన దర్శకుడిలో కనిపించింది.
కోన వెంకట్ అన్నీ తానై నడిపిన సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి అనే కొత్త దర్శకుడికి డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారు కోన. ఇదొక సీక్వెల్. కథ కథనంలో పెద్ద కొత్తదనం కనిపించలేదు. సీక్వెల్ కారణంగా దర్శకుడిగా శివ మార్క్ ఏమిటో తెలిసిరాలేదు. సుహాస్, రుహాని, శర్మ, కార్తీక రత్నం, విరాజ్ అశ్విన్ ఇలా యంగ్ యాక్టర్స్ ‘శ్రీరంగ నీతులు’ సినిమా చేశాడు ప్రవీణ్ కుమార్. ఈ సినిమా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది.
సుకుమార్ శిష్యుడు అర్జున్ ‘ప్రసన్న వదనం’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తాను లాజిక్ వున్న సినిమాలు చేయడానికి అర్జున్ కారణమని ప్రమోషన్స్ లో స్వయంగా సుకుమార్ చెప్పడంతో అర్జున్ పై ఓ నమ్మకం కుదిరింది. అయితే ఈ సినిమా ఆశించినంత ప్రభావం చూపలేదు. కాన్సెప్ట్ కొత్తగా వున్నప్పటికీ స్క్రీన్ ప్లే మెరుపులు కనిపించలేదు.
‘ప్రారంభం’తో దర్శకుడిగా అజయ్ నాగ్ పేరు వినిపించింది. నిజానికి థియేటర్స్ లో రిలీజైనప్పుడు ఈ సినిమాపై పెద్ద దృష్టిపడలేదు. కానీ ఓటీటీలో చూసిన తర్వాత కొత్త కాన్సెప్ట్ ని లిమిటెడ్ బడ్జెట్ తో చాలా క్యాలిటీతో తీశారనే పేరు వచ్చింది. తన నుంచి భవిష్యత్ లో కొత్త రకం సినిమాలు ఆశించవచ్చనే నమ్మకం కలిగించాడు అజయ్. గోపాల కృష్ణ దర్శకుడిగా పరిచయమైన ‘కృష్ణమ్మ’ రిలీజ్ కి ముందు అంచనాలు పెంచింది కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. అయితే తనలో ఓ ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్ వున్నాడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు.
కార్తికేయ ‘భజే వాయువేగం’తో కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇచ్చాడు. రేసీ స్క్రీన్ ప్లేతో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కానీ ప్రశాంత్ లో ఓ యాక్షన్ ఫిల్మ్ మేకర్ కనిపించాడు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాతో శివ పాలడుగుకి మంచి మార్కులు పడ్డాయి. తను ఎంచుకున్న కథ, ఆ కథని చెప్పిన విధానం ఆకట్టుకున్నాయి.
‘పేకమేడలు’తో నీలగిరి మామిళ్ల ఒక రియలెస్టిక్ కథని అంతే సహజంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ‘బర్త్డే బాయ్’ తో విస్కీ దాసరి తీసిన థ్రిల్లర్ ఓ కొత్త ప్రయత్నమే. ‘అలనాటి రాంచంద్రుడు’ తో చిలుకూరి ఆకాష్ రెడ్డి చేసిన లవ్ స్టొరీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
కమిటీ కుర్రాళ్లు సినిమాతో యదువంశీ దర్శకుడిగా తన మార్క్ చాటుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే చాలా క్యారెక్టర్స్ ని డీల్ చేసి ఆయన చెప్పిన ఓ పల్లెటూరి జాతర కథ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. క్లైమాక్స్ లో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని వుంటే సినిమా మరింత మంచి ఫలితం చూసేది.
ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రం ‘ఆయ్’. కొత్త దర్శకుడు అంజి తీసిన ఆయ్ కమర్షియల్ గా భలే వర్క్ అవుట్ అయ్యింది. విలేజ్ బడ్డీ కామెడీ ని దర్శకుడు అంజి డీల్ చేసిన విధానం అందరినీ అలరించింది. నిజానికి ఈ సినిమా కోసం అంజి ఎంచుకున్న ఇతివృత్తం సున్నితమైనది. ఇలాంటి సబ్జెక్ట్ ని ఫ్రెండ్సిప్ తో ముడిపెట్టి ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశాడు అంజి.
ఈ ఏడాది యునానిమస్ గా విమర్శకులు ప్రశంసలు పొందిన సినిమా 35 చిన్న కథ కాదు. ఒక మామూలు పాయింట్ ని ఎంత ఇంపాక్ట్ ఫుల్ గా తీయొచ్చు దర్శకుడి నందకిషోర్ ఈమని చూపించాడు. అందరూ రిలేట్ అయ్యే కథని మనుసుని హత్తుకునేలా చెప్పాడు. గణితంలో జీరోతో కుస్తీ పడే ఓ పిల్లాడు, ఆ పిల్లాడి కోసం తల్లితండ్రులు ఆరాటం, స్కూల్, స్నేహితులు, భార్య భర్తల బంధం.. ఇలా కథలో తను టచ్ చేసిన ప్రతి ఎలిమెంట్ పండింది. ఈ సినిమాకి అవార్డులు వచ్చే అవకాశం పుష్కలంగా వుంది.
సుహాష్ తో సందీప్ రెడ్డి బండ్ల తీసిన ‘జనక ఐతే గనక’ కాన్సెప్ట్ మెప్పించింది కానీ ఎంగేజింగ్ డ్రామా కుదరలేదు. కొత్త దర్శకులకు విశ్వక్, సుధీర్ బాబు లాంటి ఇమేజ్ వున్న హీరోలు దొరకడం ఒక బలమే. అయితే సుదీర్ బాబుతో అభిలాష్ రెడ్డి తీసిన మా నాన్న సూపర్ హీరో, విశ్వక్ తో రవితేజ ముళ్ళపూడి తీసిన మెకానిక్ రాకీ అంత ప్రభావాన్ని చూపలేదు.
‘క’ సినిమాతో కొత్త ఆశలు రేపారు దర్శకులు సుజిత్ సందీప్. టాలీవుడ్ లో ఇప్పటివరకూ పెద్ద టచ్ చేయని కర్మ సిద్దాంతం బ్యాక్ డ్రాప్ ని తీసుకొని చేసిన ‘క’ కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఒక ఫిలాసఫీని కూడా ఇంత ఎంగేజింగా చెప్పుచ్చనే ఆలోచన రేకెత్తించేలా సినిమాని రూపొందిచారు. కమర్షియల్ గా కూడా సినిమా వర్క్ అవుట్ అయ్యింది.