2024 ఇక చరిత్ర. సాధించిన విజయాలు, ఎదురైన పరాభవాలు అన్నీ పాఠాలే. వాటి నుంచి ఏం నేర్చుకొన్నాం, తప్పుల్ని ఎలా సరిదిద్దుకొన్నాం అనేదాన్ని బట్టే భవిష్యత్తు ఆధారపడి వుంది. గతేడాది మధురమైన విజయాల్ని చవి చూసింది చిత్రసీమ. అనుకోని పరాజయాలూ ఎదురయ్యాయి. వివాదాలకు లెక్కేలేదు. అయితే ఇప్పుడు అదంతా గతం. కొత్త యేడాది.. కొత్త ఆశలతో ముస్తాబైంది. ఈ యేడాది చిత్రసీమ నుంచి ఎలాంటి అద్భుతాలు రాబోతున్నాయనేదానిపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం వచ్చేసింది. ఈ యేడాది కచ్చితంగా బాక్సాఫీసు తలరాతను మారుస్తాయన్న భరోసా కొన్ని చిత్రాలు కల్పిస్తున్నాయి. అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే 2025ని మరింత ప్రియమైన సంవత్సరంగా మార్చుకొనే అవకాశం వుంది.
ఈ యేడాది కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిపై అటు అభిమానులు ఇటు చిత్రసీమ చాలా ఆశలు పెట్టుకొంది. సంక్రాంతికి రాబోతున్న చిత్రాలతో గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్ సినిమా. శంకర్ సినిమా అంటేనే భారీదనం. దానికి చరణ్ ఇమేజ్ తోడైంది. దిల్ రాజు ఖర్చుకు వెనుకాడని వ్యక్తి. ఈ సినిమాపై ఎంత ఖర్చు పెట్టారు? అనే లెక్కలు అధికారికంగా బయటకు రానప్పటికీ దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ అయితే ఈ సినిమాకు కేటాయించి ఉండొచ్చన్నది ఓ అంచనా. శంకర్ ఇటీవలే ట్రాక్ తప్పాడు. తను మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఈ సినిమాతో హిట్టు కొట్టడం తప్పనిసరి. సంక్రాంతి సీజన్లో ఈ సినిమా విడుదల కావడం పెద్ద ప్లస్ పాయింట్. దాన్ని గేమ్ ఛేంజర్ ఎంత వరకూ క్యాష్ చేస్తుందో చూడాలి. బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’ పైనా పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్నాయి. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ జాస్తి. అది మరింత కలిసివస్తుంది. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ పర్ఫెక్ట్ పండగ బొమ్మ. అన్నీ కుదిరితే.. ఈ మూడు చిత్రాలతో 2025కు ఘనమైన స్వాగతం లభించొచ్చు.
ప్రభాస్ నుంచి ఈ యేడాది ‘రాజాసాబ్’ రానుంది. ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ అన్నారు కానీ, అది సాధ్యం కాకపోవొచ్చు. కానీ ఎప్పుడొచ్చినా ‘రాజాసాబ్’ మ్యాజిక్ చేయగలదు. మారుతి దర్శకత్వం వహించిన సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అశలన్నీ ఈ ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి. ప్రభాస్ ది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్. ఏమాత్రం నిలబడినా – వసూళ్ల ప్రభంజనం చూడొచ్చు. సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ మే 9కి షిఫ్ట్ అయిపోయింది. ‘రాజాసాబ్’ స్థానంలో ఏప్రిల్ 10న ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. వశిష్ట దర్శకత్వం వహించిన సోషియో ఫాంటసీ సినిమా ఇది. టీజర్లో కనిపించిన విజువల్ ఎఫెక్ట్స్ పై అంతా పెదవి విరిచారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకొంది కాబట్టి, రీ వర్క్ చేసే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్‌ని పర్ఫెక్ట్ గా కథలో బ్లెండ్ చేయగలిగితే.. చిరు ఖాతాలో మరో సూపర్ హిట్ పడడం ఖాయం.
పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ ఈ యేడాదే రాబోతున్నాయి. వీటిలో ‘ఓజీ’ క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీసు దగ్గర పూనకాలు రావడం ఖాయం. టీజర్‌తోనే దుమ్ము దులిపేశాడు సుజిత్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ‘వీరమల్లు’ని కూడా తక్కువ అంచనా వేయలేం. కాకపోతే… ఇనిస్టెంట్ గా అందరి దృష్టీ ‘ఓజీ’పైనే ఉంది. బాలకృష్ణ ‘అఖండ 2’ ఈ దసరాకు సిద్ధం అవుతోంది. బాలయ్య నుంచి ఈ యేడాది వచ్చే రెండో సినిమా ఇది. బోయపాటి తో కాంబో అంటే బాలయ్య అభిమానులకు పండగే. ‘అఖండ’ బాలకృష్ణ కెరీర్లో మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. ఈ సీక్వెల్ కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా తీర్చిదిద్దుతున్నాడు బోయపాటి.
ఈ యేడాది రాబోయే సినిమాల్లో ‘తండేల్’ కూడా ప్రధానమైనదే. గీతా ఆర్ట్స్ ఈ సినిమాపై దాదాపు రూ.100 కోట్లకు పైగానే ఖర్చు పెట్టింది. నాగచైతన్య – సాయి పల్లవి కాంబో ఆల్రెడీ హిట్. సాయి పల్లవి వల్ల చూడదగ్గ సినిమాల జాబితాలో.. ‘తండేల్’ కూడా చేరిపోయింది. విజయ్ దేవరకొండ సినిమాని ఏప్రిల్ లో గానీ, మేలో గానీ విడుదల చేస్తారు. దానిపై కూడా గట్టిగానే ఫోకస్ వుంది. నాని ‘హిట్ 3’, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలపై కూడా టాలీవుడ్ ఫోకస్ పెట్టింది. ఇవన్నీ మంచి అంచనాలతో ముస్తాబవుతున్న సినిమాలే. ఆశలకు తగ్గట్టుగా ఈ చిత్రాలు సరైన ఫలితాలు సాధిస్తే 2025లో టాలీవుడ్ మరింత మెరిసిపోవడం ఖాయం.