సీక్వెల్స్ టాలీవుడ్ కు కలిసిరావనే సెంటిమెంట్ ని 2024 చెరిపేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సీక్వెల్ నుంచే వచ్చింది. అలాగే మీడియం, చిన్న సినిమాలు కూడా సీక్వెల్స్ తో అదరగొట్టాయి. ఆ వివరాల్లోకి వెళితే..
డిజే టిల్లు 2తో బాక్సాఫీసు కళకళలాడింది. ఈ సీక్వెల్ తో వందకోట్ల క్లబ్ లో చేరిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ ఏడాది మంచి లాభాలు తెచ్చి నిర్మాతల్ని సంతోషపెట్టిన సినిమాల్లో ఇదొకటి. ఈ విజయంతో పార్ట్ 3ని కూడా అనౌన్స్ చేశారు. నవ్వులతో పాటు కాసులు కురిపిచింది మత్తువదలరా 2. పార్ట్ 1 కూడా విజయం సాధించింది కానీ థియేటర్స్ నుంచి రావాల్సిన రెవెన్యూ రాలేదు. ఈసారి ఆ లోటు తీరింది. జనాలు థియేటర్స్ లో చూశారు. నిర్మాతలు ఆశించిన దానికంటే మంచి ఫలితం వచ్చింది.
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ హిట్ గా అవతరించింది పుష్ప 2. ఇప్పటివరకూ రూ.1,700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు లెక్కకడుతున్నాయి. విడుదలైన 25వ రోజు(నిన్న ఆదివారం) కూడా దేశవ్యాప్తంగా రూ.16 కోట్ల నెట్ వసూలు చేసిందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. వసూళ్ళు పరంగా పుష్ప 2 ఓ సునామీ అనే చెప్పాలి.
ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. రామ్, పూరి జగన్నాథ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సీక్వెల్ దారుణంగా దెబ్బకొట్టింది. సినిమా కొనుక్కున్న జనాలు లబోదిబో అన్నారు.
మరోవైపు రీమేక్స్ కి ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదు. నాగార్జున ఈ ఏడాది సంక్రాంతికి ‘నా సామిరంగ’తో ప్రేక్షకుల్ని పలకరించారు. మలయాళంలో విజయవంతమైన ‘పొరింజు మరియం జోస్’కు రీమేక్ ఇది. సినిమా రిజల్ట్ యావరేజ్ దగ్గర ఆగింది. అయితే ఈ మధ్య కాలంలో నాగార్జున నుంచి వచ్చిన డీసెంట్ సినిమా అనే టాక్ తెచ్చుకుంది.
రీమేక్ కథని కొత్త హంగులతో తీర్చిదిద్దే హరీశ్ శంకర్ ఈ ఏడాది రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ చేశాడు. ఇది బాలీవుడ్ హిట్ సినిమా ‘రైడ్’కు రీమేక్‌గా రూపొందింది. అయితే ఒరిజినల్ కథలోని ఎసెన్స్ రిమేక్ లో కనిపించలేదు. పాటలు ఆడియో పరంగా అలరించాయి కానీ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చూసింది.
ఈ ఏడాది ఓ హాలీవుడ్ కథ తెలుగులోకి వచ్చింది. శర్వానంద్ తో మనమే సినిమా తీశాడు శ్రీరామ్ ఆదిత్య. హాలీవుడ్ సినిమా ‘లైఫ్ యాస్ వీ నో ఇట్’ సినిమా మూలకథ స్ఫూర్తితో ఈ కథను అల్లుకున్నారు. అయితే ఈ డ్రామా తెలుగు ఆడియన్స్ కి పట్టలేదు. అల్లు శిరీష్ చేసిన ‘బడ్డీ’ ఆర్య నటించిన తమిళ సినిమా ‘టెడ్డీ’కి రీమేక్‌గా రూపొందింది. శిరీష్ కెరీర్లో ‘బడ్డీ’ మరో ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా మిగిలింది.