రాజకీయాలు, వ్యాపారాల్లో అవినీతి, దోపీడీల గురించి ప్రజలు వినుంటారు. సినిమా ఇండస్ట్రీలో అయితే శ్రమ దోపీడీ మాత్రమే వుంటుంది. చేసిన పనికి సరిగా డబ్బులు ఇవ్వకపోవడం మాత్రమే వుంటుంది. అయితే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త తరహా అవినీతి ఆరోపణ వెలుగులోకి వచ్చింది. దర్జాగా కొందరు నిర్మాతల డబ్బును మరి కొందరు పెద్దలు కలిసి కాజేసినట్టు దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మానసపుత్రిక ‘అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఎల్ఎల్పి‘ లో 28 కోట్ల స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ‘ఎల్ఎల్పి’లో పెద్దలు నిర్మాతల డబ్బు 28 కోట్ల రూపాయలను దోచేశారని తమ్మారెడ్డి పేర్కొన్నారు. “నేను చెప్పేది అబద్ధమైతే మీడియా ముందుకు వచ్చి ఖండించమనండి” అని సవాల్ విసిరారు.
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ద్వారా నిర్మాతలు తమ తమ సినిమా ప్రకటనలు ఇవ్వాలంటే చాలా సంస్థలకు ఇవ్వవలసి వుంటుంది. అందువల్ల నిర్మాతలకు పబ్లిసిటీ ఖర్చు తడిసిమోపెడు అవుతుందని ‘దిల్’ రాజు 2015 లో కొత్త ఆలోచన చేశారు. ఎంపిక చేసిన కొన్ని ఛానళ్లు, కొన్ని పత్రికలు, వెబ్ మీడియాకు మాత్రమే తగ్గింపు రేటులకి ప్రకటనలు ఇచ్చేలా సుమారు పది మంది నిర్మాతలతో కలిసి ‘ఎల్ఎల్పి’ సంస్థను స్థాపించారు. ఇందుకు గాను ఎల్ఎల్పి 10% ఫీజు నిర్మాతల దగ్గర వసూలు చేస్తుంది. ఇదేదో బాగుంది, ఖర్చు తగ్గుతుందని చాలామంది చోటా మోటా నిర్మాతలు ‘ఎల్ఎల్పి’ ద్వారా ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. ఐడియా అయితే ఇచ్చాను కానీ అందులో వ్యవహారాలను నేను పర్యవేక్షించడం లేదని ఒకానొక సందర్భంలో దిల్ రాజు చెప్పారు.
ప్రకటనల నిమిత్తం నిర్మాతల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుల్లో ‘ఎల్ఎల్పి’లో పెద్దలు 28 కోట్లు దోచేశారని తమ్మారెడ్డి ఆరోపణ. ఒక ప్రముఖ పత్రికతో ఆయన మాట్లాడుతూ “టీవీలలో, కొన్ని మీడియా సంస్థల్లో ‘ఎల్ఎల్పి’ లో 28 కోట్ల స్కామ్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు దోచేస్తుంటే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఏం చేస్తోంది? మండలిని కాదని కొందరు వ్యక్తులు అటువంటి సంస్థ పెడితే రెండేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? నేను చెప్పేది అబద్ధమైతే ఖండించండి. నిజమైతే… దోచేసిన వారిని ఇండస్ట్రీలో లేకుండా చేయాలి” అని ఆయన పేర్కొన్నారు. దీంతో తాజాగా ‘ఎల్ఎల్పి’ తెరపైకి వచ్చింది. అసలు ‘ఎల్ఎల్పి’లో ఎవరు వున్నారు? ఎవరెవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఎవరు అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు? అనే అంశాలపై ఇండస్ట్రీ పెద్దలు స్పష్టత ఇవ్వవలసి వుంది.
దీనికి సంబంధించి తెలుగు360 “అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ” వర్గాలతో మాట్లాడగా ఆ ఆరోపణలు నిరాధారం అని తోసిపుచ్చారు. ” వివిధ కారణాల వల్ల మల్కాపురం శివ, ప్రతాని రామక్రిష్ణ గౌడ్, తమ్మారెడ్డి ఇలాంటి ఆరోపణలు అప్పుడప్పుడు చేస్తుంటారు ” అని ఆ వర్గాలు తెలియజేసాయి.
ఆయితే నిజం ఏమిటో, ఆ లెక్కలు ఏవో పబ్లిక్ గా ఎల్ఎల్పి తరపున ఎవరైనా ముందుకు వచ్చి ఇండస్ట్రీకి ఇస్తారేమో వేచి చూడాల్సిందే !