ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు(65) శనివారం రాత్రి హైదరాబాద్, అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 17న అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
‘మాడా’ పూర్తి పేరు మాడా వెంకటేశ్వర రావు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో దుళ్ల అనే గ్రామంలో 1950 అక్టోబర్ 10న జన్మించారు.ఆయనకు నలుగురు కుమార్తెలున్నారు. ఆయన మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఇంజనీరుగా చేసేవారు. ఆ తరువాత నాటకాల మీద మోజుతో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనలో ప్రతిభను గుర్తించి దర్శకుడు బాపు ఆయనకు తన సినిమాలలో అవకాశం కల్పించారు. ఆ విధంగా సినీ పరిశ్రమలో ప్రవేశించిన మాడా దాదాపు 300 పైగా సినిమాలలో నటించారు. వాటిలో ముత్యాల ముగ్గు, చిల్లర కొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ళ రాందాసు సినిమాలు ఆయనకు సినీ పరిశ్రమలో గట్టి పునాదివేశాయి. ముఖ్యంగా 1977 సం.లో విడుదలయిన ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ సినిమాలో పువ్వుల కొమ్మయ్య అనే నపుంసక పాత్రలో ఆయన ప్రదర్శించిన అద్భుత నటన అటువంటి పాత్రలకు ట్రేడ్ మార్క్ గా నిలిచిపోయింది. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఆయన చేసిన ‘చూడు పిన్నమా…పాడు పిల్లోడు..’అనే పాట ఆయనకు, దానిని పాడిన ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యంకి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో నపుంసకుడిగా వేయడం వలన మాడా ఎంతగా పాపులర్ అయ్యారో అదే పాత్ర ఆయన నటనా జీవితానికి పెద్ద ప్రతిబంధకంగా మారిందని చెప్పవచ్చును. ఆ తరువాత ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ ఆయనకు అదే ట్రేడ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. అయినప్పటికీ ఆయన అనేక సినిమాలలో విభిన్నమయిన పాత్రలు పోషించి తన ప్రతిభను చాటుకొన్నారు.