హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయమయిన వరుణ్ సందేశ్ ఆ తరువాత కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ మళ్ళీ ఇంత వరకు మంచి హిట్ దొరకలేదు. కానీ జీవిత భాగస్వామి మాత్రం దొరికిందని తాజా సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో జన్మించి ముంబై లో చదువుకొని, తమిళ్, కన్నడ, తెలుగు సినిమాలలో నటిస్తున్న విదిక షెరు (కీర్తి రావు)ని వివాహం చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం. వారిద్దరూ ‘పడ్డానండి ప్రేమలో మరి’ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుండే వారిద్దరూ నిజంగానే ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.
విదిక షెరు బాల్య నటిగా అనేక టెలివిజన్ సీరియల్స్ లో నటించింది. 15ఏళ్ల వయసులో ‘అంతు ఇంతు ప్రీతీ బంతు’ అనే కన్నడ సినిమాతో సినీ రంగప్రవేశం చేసింది. తరువాత 2009లో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి ప్రేమించే రోజుల్లో, సందడి, జుమ్మంది నాదం, భీమిలి కబాడీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమాలలో నటించింది. వరుణ్ సందేశ్ తో కలిసి నటించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా హిట్ కాకపోయినా వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కేందుకు ఉపయోగపడిందని తృప్తి పడాలి. త్వరలోనే వారి పెళ్లి కబురు వినిపించే అవకాశం ఉంది.