సాధారణంగా డిసెంబరుని టాలీవుడ్ లైట్ తీసుకొనేది. సంక్రాంతి ముందు నెల కాబట్టి, పెద్దగా సినిమాలు విడుదల చేసేవారు కాదు. ఒకవేళ సినిమాలు వచ్చినా, ప్రేక్షకుల ఆదరణ ఉండదని భయపడేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిసెంబరులోనూ పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ డిసెంబరులోనూ క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా డిసెంబరు 20న టాలీవుడ్ గురి పెట్టింది.
డిసెంబరు 6న ‘పుష్ష 2’ విడుదలకు సిద్ధమైంది. 20న ‘గేమ్ ఛేంజర్’ రావాల్సింది. కానీ వాయిదా పడింది. ఎప్పుడైతే గేమ్ ఛేంజర్ వాయిదా పడిందో, ఆ డేట్ పై మిగిలిన నిర్మాతలు కన్నేశారు. ‘తండేల్’ని డిసెంబరు 20న విడుదల చేయాలన్నది ఓ ప్లాన్. అయితే దీనిపై అల్లు అరవింద్ ఓ నిర్ణయం తీసుకోవాల్సివుంది. డిసెంబరు 20న నితిన్ ‘రాబిన్ హుడ్’ విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఇంద్రగంటి మోహనకృష్ణ – ప్రియదర్శి కాంబినేషన్లో ‘సారంగపాణి’ అనే ఓ సినిమా తయారవుతోంది. దీన్ని డిసెంబరు 20న వదలాలని చూస్తున్నారు. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇదే డేట్ ని టార్గెట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్’ అనే సినిమా రూపుదిద్దుకొంది. డిసెంబరు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించేసింది. అంతే కాదు… మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప`ని డిసెంబరు 20 లేదా 21న విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఈ డేట్ తప్పితే.. క్రిస్మస్కు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆగస్టు 15, వినాయకచవితి, దసరాలకు గుంపుగా సినిమాలొచ్చాయి. అయితే ఎవరూ పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు దీపావళికి కూడా నాలుగైదు సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి. ఆ తరవాత క్రిస్మస్కు ముందు కూడా ఇలాంటి వాతావరణమే కనిపించబోతోంది. సోలో రిలీజ్ కంటే, ఇలా పోటాపోటీగా సినిమాల్ని విడుదల చేసుకోవడంలోనే కిక్ ఉందని నిర్మాతలు భావిస్తున్నారేమో మరి!