అగ్ర హీరోల ఆడియో ఫంక్షన్ అనగానే… ఆ హంగూ, ఆర్భాటం కళ్లముందు మెదులుతాయి. యాంకరమ్మ వయ్యారాలు పోతూ, హీరోల్ని, హీరోయిన్లని పిలుస్తూ… అభిమానులతో కేరింతలు కొట్టిస్తుంటుంది. టాలీవుడ్లో యాంకర్లకు భలే డిమాండు ఉందిప్పుడు. మూడు గంటల కార్యక్రమానికి ఏకంగా 2.5 లక్షలు సంపాదించే యాంకర్లున్నారు. టాప్ యాంకర్లుగా కొనసాగేవాళ్లదే ఇప్పుడు రాజ్యం. వాళ్లు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు, ఈవెంట్ మేనేజర్లు రెడీ అంటున్నారు. మరి ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నారు? టాలీవుడ్లో నెం.1 యాంకర్ ఎవరు?
టాలీవుడ్‌లోని యాంకర్లలో అగ్రతాంబూలం సుమకే ఇవ్వాలి. ఆమే ఇప్పుడు నెంబర్ వన్. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యాంకర్ కూడా తనే. హైదరాబాద్‌లో అయితే.. ఒక్క ఈవెంట్‌కి రూ.లక్ష నుంచి 1.5 లక్షల వరకూ తీసుకుంటుంది. అదే విజయవాడో, తిరుపతో, విశాఖో అయితే… పారితోషికం రూ.2.5 లక్షల వరకూ వసూలు చేస్తుంది. దీనికి పన్నులు అదనం. సుమ తరవాత ఉదయభానుకి అంత డిమాండ్ ఉంది. ఆమెకు రూ.1 లక్ష నుంచి 1.25 లక్షల వరకూ పారితోషికం ముడుతుంది. అవుడ్డోర్ అయితే… ఆ మొత్తం రెట్టింపు అవుతుంది. ఝాన్సికి రూ.75 వేలు ఇవ్వాలి.
శ్రీముఖి రూ.1 లక్ష పలుకుతోంది. శిల్పా చక్రవర్తి, శ్యామల రూ.25 నుంచి రూ.50 వేలు రాబడుతున్నారు. చిన్న సినిమాలైతే మంజూష, గాయత్రి భార్గవిలకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. వీళ్లే అతి తక్కువ మొత్తానికి యాంకరింగ్ చేసి పెడుతున్నారు. అనసూయ ఇప్పుడు యాంకరింగుపై దృష్టి పెట్టడం లేదు. ఆమె పబ్లిక్ ఫంక్షన్లకు హాజరవ్వడం బాగా తగ్గించేసింది. అనసూయ యాంకరింగ్ చేసే రోజుల్లో ఆమె పారితోషికం రూ.1 లక్ష. ఇప్పుడు రెండు లక్షలు ఇవ్వడానికి రెడీ అన్నా… అనసూయ `నో` చెబుతోంది.
మేల్ యాంకర్లలో ఈమధ్య ప్రదీప్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. తన పారితోషికం లక్ష వరకూ ఉంది. రవి రూ.50 వేలకు వచ్చేస్తున్నాడు. కానీ.. మేల్ యాంకర్ల కంటే ఫిమేల్ యాంకర్లపైనే ఈవెంట్ మేనేజర్లు దృష్టి పెడుతున్నారు. యాంకర్లకు ఉన్న డిమాండ్ వల్లే… ఈ రంగంలో అడుగుపెట్టాలనుకుని యువతరం ఆశ పడుతోంది. అందుకే భవిష్యత్తులో మరింతమంది యాంకర్లను చూడొచ్చు.