ఏదైనా ప్రకృతి వైపరిత్యం జరిగినప్పుడు చిత్రసీమ ధీటుగానే స్పందిస్తుంటుంది. కాస్త అటూ ఇటూ అయినా హీరోలంతా స్వచ్ఛందంగా ముందకొచ్చి భారీ వితరణ ప్రకటిస్తుంటారు. ఈసారి కరోనా వచ్చింది. ఇది ఒక్కరి సమస్యే కాదు. ప్రపంచ సమస్య. సైన్స్‌ని, సృష్టినీ సూటిగా ప్రశ్నించే విధ్వంసం. ప్రతి ఒక్కరూ తమంతట తాము మేల్కొంటే తప్ప – నివారణ లేని రోగం.
ఈ విషయంలో ప్రజల్ని చైతన్య పరచడంలో తెలుగు చిత్రసీమ స్పందించిన తీరు అపూర్వం అనే చెప్పాలి. `షూటింగులు బందు చేయండి` అంటూ ప్రభుత్వ ఆజ్ఞ రాకుండానే క్లాప్ బోర్డుల్ని పక్కన పెట్టేసింది టాలీవుడ్. అంతేకాదు.. చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్లు ముందుకొచ్చి కరోనా వైరస్ నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పూస గుచ్చినట్టు వివరించారు. ఎవరి ఫేస్ బుక్, ట్విట్టర్ తెరిచినా కరోనాకి సంబంధించిన విషయాలే. ఈరోజు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి తన వంతు సాయం చేసింది చిత్రసీమ. టాప్ హీరోలు, హీరోయిన్లు. టెక్నీషియన్లు ముందుకొచ్చి…. వీడియోలు రూపొందించి అభిమానులకు ఆదర్శంగా నిలిచారు.
ఈరోజు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు.. దేశ ప్రజలంతా ఆరు బయటకు వచ్చి హర్షద్వానాలతో వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. `కులాలు వేరైనా, మతాలు వేరైనా భారతీయులంతా ఒక్కటే` అనే సంకేతాన్ని పంపారు. ఈ విషయంలోనూ సినీ స్టార్లదీ హర్షణీయమైన పాత్రే. ఎన్టీఆర్, రామ్ చరణ్, మోహన్ బాబు, మనోజ్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, గోపీచంద్, అల్లు అర్జున్.. ఇలా ఒక్కరేమిటి? దాదాపు టాలీవుడ్ లోని ప్రముఖులంతా సరిగ్గా 5 గంటలకు చప్పట్లు కొడుతూ.. తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కరోనా ఓ మహమ్మారి. దాన్ని తరిమికొట్టాలంటే అవగాహనే ఆయుధం. దాన్ని అభిమానుల్లో కల్పించడానికి ఇలా స్టార్లంత కదం తొక్కడం హర్షణీయం. ఆచరణీయం. ఇప్పుడు కదా రియల్ స్టార్లు అనిపించుకునేది.