టాలీవుడ్ లో కొత్త సినిమాల విడుదల ఎప్పడూ అతివృష్టి, అనావృష్టిగానే వుంటుంది, పడితే ఒకటే డేట్ మీద రెండు మూడు సినిమాలు పడిపోతాయి. లేదా వారం ఖాళీగా వదిలేస్తారు. ఏప్రిల్ మొదటి వారం పరిస్థితి ఇలానే వుంది. ఈ వారంలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేదు.
28°C'(28 డిగ్రీస్ సి), శారీ , LYF, శివాజ్ఞ ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల పేర్లు. కనీసం ఈ పేర్లు కూడా ఎవరికీ రిజిస్టర్ కాలేదు. ఈ మొత్తం సినిమాల్లో ‘శారీ’ ఎంతో కొంత సోషల్ మీడియాలో నానింది. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ఇది. సహజంగానే ఆయన సినిమాపై ఇప్పుడు ఎవరికీ ఆసక్తి లేదు. అయితే తనవరకూ ప్రమోట్ చేసుకుంటున్నాడు. కాకపొతే ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలని యూట్యూబ్ లో కూడా జనాలు చూడటం లేదు. ఈ సినిమా కోసం ఎంతమంది థియేటర్స్ కి వస్తారో ఆయనకే తెలియాలి.
అన్నట్టు.. ఈ వారం ఓ స్పెషాలిటీ వుంది. బాలయ్య ‘ఆదిత్య 369’ రీరిలీజ్ గా వస్తోంది. దీనికోసం బాలయ్య స్వయంగా ప్రమోషన్స్ చేశారు. రీరిలీజ్ ప్రెస్ మీట్ కి వచ్చారు. రీరిలీజ్ ప్రెస్ మీట్ కి హీరో రావడం ఇదే తొలిసారి. ఆదిత్య 369 ఓ క్లాసిక్. బహుశా ఈ వారం థియేటర్స్ కి వెళ్లాలనుకునే ఆడియన్స్ కి ఇదొక ఆప్షన్ కావచ్చు. అలాగే కొత్త సినిమాలు లేకపోవడం గత వారం వచ్చిన మ్యాడ్ 2, రాబిన్ హుడ్, లూసిఫర్, వీరధీర శూరకి కలిసొచ్చే అంశం.