2021 టాలీవుడ్ కి బాగానే ఉంది.. అనుకునే లోగానే.. దిష్టి తగిలేసింది. 2021 జనవరి, ఫిబ్రవరి, మార్చి.. నెలల్లో ఒక్కో హిట్ టాలీవుడ్ కి తగిలింది. నెలకో హిట్ అంటే… మంచి విషయమే. ఏప్రిల్ లో `వకీల్ సాబ్` కూడా హిట్ జాబితాలో చేరిపోయింది. దాంతో వరుసగా నాలుగు నెలలు, నాలుగు హిట్లు అనుకున్నారు. అంతలోనే కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా రావడంతో.. థియేటర్ల దగ్గర కళ తప్పింది. అప్రకటిత బంద్ తో… పరిశ్రమ బోసి బోయింది.
టాలీవుడ్ కి ఏప్రిల్ నెల.. ఉధృతంగానే మొదలైంది. 2న వైల్డ్ డాగ్, సుల్తాన్ సినిమాలు విడుదలయ్యాయి. రెండింటిపైనా మంచి అంచనాలే ఉన్నా.. రెండూ బాక్సాఫీసు దగ్గర తుస్సుమన్నాయి. వైల్డ్ డాగ్ టాక్ బాగానే ఉన్నా, స్పందన శూన్యం. ప్రచారం భారీగా చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక సూల్తాన్.. బాగా నిరాశ పరిచాడు. ఈ రెండు సినిమాలకూ కనీసం ఓపెనింగ్స్ కూడా లేకుండా పోయాయి. ఏప్రిల్ 9న విడుదలైన `వకీల్ సాబ్` బాక్సాఫీసు దగ్గర వసూళ్ల హంగామా సృష్టించింది. తొలి మూడు రోజుల్లోనే రికార్డు వసూళ్లు అందుకుంది. ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం, టికెట్ రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో.. కాస్త వివాదం చెలరేగింది. పవన్ పై ఇది కక్ష్య సాధింపు చర్య అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అవాంతరాలు లేకపోతే… వకీల్ సాబ్ ఎప్పుడో బ్రేక్ ఈవెన్ దాటేసేది.
వకీల్ సాబ్ విడుదలైన రెండో వారానికే…. థియేటర్ల విషయంలో ఆంక్షలు మొదలైపోయాయి. చాలా చోట్ల థియేటర్లు స్వచ్ఛందంగా మూసేశారు. ఈ పరిస్థితి ముందే గమనించడంతో… లవ్ స్టోరీ, టక్ జగదీప్, ఇష్క్ లాంటి సినిమాలు వాయిదా బాట పట్టాయి. అయినా కొన్ని సినిమాలు… విడుదలకు ఎగబడ్డాయి. వకీల్ సాబ్ తరవాత ఏడెనిమిది చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర క్యూ కట్టాయి. అయితే.. వాటి జాడ ప్రేక్షకులకు తెలీలేదు. అవి వచ్చాయన్న సంగతీ తెలియకుండా పోయింది.
ఈనెలలోనే ఓటీటీ హడావుడి కూడా పెరిగింది. కొత్త సినిమాలు ఓటీటీలో ప్రదర్శనకు దిగడంతో.. ఆ వేదిక కళకళలాడింది. ఈనెలలో విడుదలైన పెద్ద సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీలో కనిపిస్తున్నాయి. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడ్డానికి భయపడినవాళ్లంతా ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే నచ్చిన సినిమా చూసేయొచ్చు. వకీల్ సాబ్ 50 రోజులు కాకముందే… అమేజాన్ లో ప్రదర్శితం కావడం విషయంలో.. అమెరికా బయర్లు… దిల్ రాజుపై గుర్రుగా ఉన్నారు. ఈ తగాదా ఎప్పుడు ఎలా తీరుతుందో మరి..?!
చిత్రసీమ ప్రస్తుతం పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. షూటింగులు చేయాలా వద్దా? ఇంకొంత కాలం ఎదురు చూడాలా? లేదంటే ఓటీటీ బాట పట్టాలా? అనేది సందిగ్థంలో ముంచే విషయాలు. కరోనా వల్ల…. వేసవి షెడ్యూల్ అంతా అస్తవ్యస్తమైంది. సినిమాలన్నీ వాయిదా పడడంతో.. ఎప్పుడు ఏ సినిమా వస్తుందో, అసలు సినిమాలు వస్తాయో రావో అనే గందరగోళాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చక్కబడి… చిత్రసీమ మళ్లీ మామూలు స్థితికి ఎప్పుడు వస్తుందో?