కథాబలం సంగతి ఎలా ఉన్నా, బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడంలో టాలీవుడ్ కొత్త రికార్డులు తిరగరాస్తుంది. కలెక్షన్లే ప్రాతిపదిక అయితే గనక, మన ముందు బాలీవుడ్ బలాదూర్. వట్టి అభిమానంతో చెప్పే మాట కాదండోయ్. పక్కా లెక్కులున్నాయ్, చూడండి.
అమెరికాలో గత వీకెండ్ కలెక్షన్స్ లో తెలుగు సినిమాలు దుమ్మురేపాయి. వీటి ముందు హిందీ సినిమాలు డంగైపోయాయి. కిక్ 2 అయితే అమెరికా బాక్సాఫీస్ లో మోత మోగించింది. గత వీకెండ్ కలెక్షన్ లిస్టులో కిక్ 2 ఏకంగా 28వ ర్యాంకులో నిలిచింది. 3,07,195 డాలర్లు వసూలు చేసిందట. అంటే భారతీయ కరెన్సీలో 2 కోట్ల రూపాయలకు పైనే. మొదటి వారాంతంలో ఇదీ కిక్ 2 స్టామినా. మొత్తం 99 స్క్రీన్లపై ఈ సినిమా ఆడుతోంది.
ఇక మహేష్ బాబు శ్రీమంతుడు 38వ ర్యాంకు సాధించాడు. ఈ సినిమా 94,498 డాలర్లు వసూలు చేసింది. అంటే 62 లక్షల రూపాయలకు పైమాటే. శ్రీమంతుడు 46 స్క్రీన్లలో ఆడుతున్నాడు.
బాలీవుడ్ సంగతి చూస్తే, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బ్రదర్స్ సినిమా 42వ ర్యాంకుకు పరిమితమైంది. 60,694 డాలర్లు, అంటే 40 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసిందట. ఇక బజ్రంగీ భాయిజాన్ వగైరా సినిమాలన్నీ నామమాత్రం కలెక్షన్లు సాధించాయని ట్రేడ్ వర్గాల సమాచారం. అమెరికా కలెక్షన్లలోనూ తెలుగు సినిమాలు బాలీవుడ్ తో పోటీ పడటమే కాదు, అధిగమించడం విశేషం.