నోరు మంచిదైతే…ఇండస్ట్రీ మంచిదవుతుందంటారు.
సినిమా జారినా ఫర్వాలేదు కానీ.. నోరు జారకూడదంటారు.
ఇవన్నీ ఆ నిర్మాతకు తెలీవేమో…? లూజ్ టంగ్ని `స్ట్రాంగ్`గా వాడేస్తున్నాడు. తను అడ్వాన్సు ఇచ్చిన దర్శకుల్ని, హీరోల్నీ `వాడెంత.. వాడి విలువెంత` అన్నట్టు మాట్లాడేస్తున్నాడు. దాంతో… సదరు నిర్మాతపై చాలామంది అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే… ఓ భారీ నిర్మాత. లేటెస్టుగానే ఇండస్ట్రీ షేక్ అయిపోయిన సినిమా తీశాడు. నిర్మాతగా బాగా వెనకేశాడు. దాంతో.. బోలెడన్ని సినిమాలు తీయాలని కంకణం కట్టుకొన్నాడు. అందరికీ ఎడా పెడా అడ్వాన్సులు ఇచ్చాడు. ఇదంతా ఓకే. కానీ… సినిమాల్ని మాత్రం పట్టాలెక్కించడం లేదు. దర్శకుడికి అడ్వాన్సు ఇస్తే సరిపోదు. హీరోని తీసుకురావాలి. హీరోని లైన్ లో పెడితే సరిపోదు. తనకు నచ్చిన కథని వెదికి పట్టుకోవాలి. ఇవన్నీ నిర్మాత ముందున్న పనులు. కానీ.. ఈ నిర్మాత అవేం పట్టించుకోవడం లేదు. అడ్వాన్సు ఇచ్చిన వాళ్లపై తీవ్ర మైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు. `సినిమా చేస్తావా.. లేదంటే నా అడ్వాన్సుని వడ్డీతో సహా తిరిగి ఇస్తావా` అంటూ దబాయిస్తున్నాడు. అక్కడికీ ఓకే. కాకపోతే.. లూజ్ టంగ్ తో ఆ దర్శకుడిపై, హీరోపై `మాటల`తో పడిపోతున్నాడని టాక్. ఇండస్ట్రీ చాలా చిన్నది. ఇక్కడి విషయాలు అక్కడికీ, అక్కడి విషయాలూ ఇక్కడికీ మోసుకుపోయేవాళ్లు చాలామంది ఉంటారు. అలా.. ఈ నిర్మాత ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నాడో, ఎవరిని చులకనగా చూస్తున్నాడో అందరికీ తెలిసిపోయింది. దాంతో సదరు దర్శకులు, హీరోలూ.. `తనతో సినిమా చేసేదే లేదు` అంటూ తెగేసి చెబుతున్నారు. అంతేకాదు.. ఇంకొంతమంది అడక్కపోయినా అడ్వాన్సులు పంపించేస్తున్నారు. కొత్తగా కాల్షీట్లు అడుగుతున్నవాళ్లు… నిర్మాత ప్రవర్తన చూసి `నో` చెబుతున్నారు. అలా… ఈ నిర్మాత చేతిలోని సినిమాలు ఒకొక్కటీ జారిపోతున్నాయని టాక్. చేతిలో పెద్ద హిట్టుంటే ఏం లాభం..? నోరు మంచిది కాన్నప్పుడు..? ఇక ఈయనతో బడా ప్రాజెక్టు సెట్ అవ్వడం కష్టమే అన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.