సంక్రాంతి.. దసరా.. అనుకుంటాం గానీ, శివరాత్రి కూడా దాన్ని మించిన సీజన్ అయిపోయింది. ప్రతీ యేటా శివరాత్రి రోజున.. కొత్త సినిమాలు గుంపుగా రావడం రివాజైపోయింది. ఎందుకంటే.. శివరాత్రి అనగానే జాగారం. సినిమాలు చూస్తూ – జాగారం చేస్తారని కాబోలు. అలా.. సెట్ చేయడం మొదలెట్టారు. శివరాత్రి రోజున ఇప్పటికీ కొన్ని ఊర్లలో సెకండ్ షోకి వెళ్తే.. ఇంకో షో ఫ్రీగా చూపించి – తెల్లవార్లూ థియేటర్లలోనే జాగారం చేసేలా ఆఫర్ ఇస్తారు.
ఈ శివరాత్రి సినీ జాగారమే. ఎందుకంటే ఒకేసారి నాలుగు సినిమాలొస్తున్నాయి. అందులో ఓ డబ్బింగ్ బొమ్మ కూడా ఉంది. శ్రీకారం, జాతిరత్నాలు, గాలి సంపత్ తో పాటు.. డబ్బింగ్ బొమ్మ రాబర్ట్ విడుదల అవుతోంది. డబ్బింగ్ సినిమాని పక్కన పెట్టినా – ఒకేసారి మూడు కొత్త సినిమాలు, అందులోనూ క్రేజ్ ఉన్న సినిమాలు రావడం చాలా రోజుల తరవాత (సంక్రాంతికీ.. సినిమాలు విడివిడిగా వచ్చాయి) ఇదే తొలిసారి.
మూడు సినిమాలపైనా ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. శర్వానంద్ సినిమా అంటే యూత్ లో క్రేజ్ ఉంటుంది. పైగా ఈసారి రైతు సమస్యల నేపథ్యంలో కథ ఎంచుకున్నాడు శర్వా. ఓ షార్ట్ ఫిల్మ్ చూసి, దాన్ని సినిమాగా చేయాలన్న ఆలోచన రావడం – తెలుగులో ఇదే తొలిసారేమో. ఇక… జాతి రత్నాలు ఫుల్ ఫన్ రైడ్ గా ఉండబోతోందన్న విషయం ట్రైలర్ చెప్పకనే చెప్పింది. `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` తరవాత… నవీన్ పొలిశెట్టి కి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. తన కామెడీ టైమింగ్ సూపర్బ్. మరోసారి… తనకు అలవాటైన, పేరు తెచ్చిన జోనర్లో సినిమా చేశాడు. అదే `జాతిరత్నాలు`. నవీన్ ఒక్కడే కాదు.. హాస్య రత్నాలు… ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తోడుగా వస్తున్నారు. బుల్ బుల్ చిట్టి.. పాట ఇప్పటికే సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది. సినిమాలో ఇంకా వింతలూ విశేషాలూ ఉన్నాయంటోంది చిత్రబృందం. మిగిలిన సినిమాలతో పోలిస్తే.. జాతి రత్నాలుకి అడ్వాన్స్ బుకింగుల సందడి ఎక్కువే ఉంది.
ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతగా మరి చేసిన ప్రయత్నం.. గాలి సంపత్. చాలా తక్కువ రోజుల్లో పూర్తయిన సినిమా ఇది. నిర్మాతగా రావిపూడి తొలి ప్రయత్నంలోనే లాభాలు చూశాడని, విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకున్నాడని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతకు అంతకంటే కావల్సిందేముంది?
ఇంతేనా అంటే… చాలా ఉన్నాయి. మహాశివరాత్రి కానుకగా.. ఫస్ట్ లుక్‌లు, టైటిళ్ల హంగామా కనిపించబోతోంది. క్రిష్ – పవన్ సినిమా టైటిల్ రేపు రాబోతోంది. బాలకృష్ణ – బోయపాటి టైటిల్ కూడా రేపే ఖరారు కాబోతోంది. ఇంకా.. ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్టులు చాలానే కనిపించబోతున్నాయి. మొత్తానికి… శివరాత్రి సినీ రాత్రిగా మారబోతోంది.