ఏపీ ప్రభుత్వంతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకోడానికి అగ్రనేతలు హుటాహుటిన మచిలీపట్నం చేరుకున్నారు. వివాదం అంతకంతూ పెరిగిపోతూండటంతో అటు ఏపీ ప్రభుత్వం.. ఇటు నిర్మాతల మధ్య కొంతమంది ప్రముఖులు మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని కూడా అంగీకరించడంతో నిర్మాతలు మచిలీపట్నం వెళ్లి పేర్ని నానిని కలిశారు. దిల్ రాజు, నాగవంశీ, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు ఇలా కలిసిన వారిలో ఉన్నారు. వీరందరూ పెద్ద సినిమాలు తీస్తున్న నిర్మాతలే. ప్రభుత్వంతో సామరస్య పరిష్కారం కోసం.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శల నేపధ్యంలో ఈ వివాదం రాజకీయ అంశమైంది. ఇండస్ట్రీ వర్గాలు ఒక్క తాటిపైకి లేవు. అలాగని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను బహిరంగంగా ఫిల్మ్ చాంబర్ మాత్రమే ఖండించింది. నిర్మాతలు అందరూ సైలెంట్‌గా ఉన్నారు. వైఎస్ఆర్ సీపీకి సన్నిహితంగా ఉండే కొంత మంది మాత్రమే పవన్ కు వ్యతిరేకంగా స్పందించారు. మిగతా వారందరూ ఏపీ ప్రభుత్వం.. ఇండస్ట్రీని వేధిస్తోందన్న అభిప్రాయంలోనే ఉన్నారు.
ఈ క్రమంలో ఈ వివాదం అంతకంతకూ పెరిగిపోవడం వల్ల రెండు వర్గాలకు నష్టం జరుగుతుందని.. పరిష్కరించుకోవడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌కు వీలైనంత వరకూ వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవలే అమరావతిలో పేర్ని నాని నిర్మాతలు కలిశారు. మళ్లీ ఇప్పుడు మచిలీపట్నంలో తేలారు. ఎలాంటి పరిష్కారం వస్తుందో వేచి చూడాలి. !