చిన్న సినిమా.. పెద్ద సినిమా… మీడియం రేంజ్ సినిమా. బడ్జెట్ ని బట్టి నిర్మాతలు చేసే వర్గీకరణలు ఇవీ. చిన్న సినిమాలే పరిశ్రమకు ఆధారం. ఎందుకంటే మార్కెట్ లో ఓ భారీ సినిమా తయారవుతోంటే, కనీసం 30 చిన్న సినిమాలు సెట్స్‌పై ఉంటాయి. చిన్న సినిమాల వల్లే అందరికీ పనులు దొరుకుతుంటాయి. మీడియం రేంజ్ సినిమాల్ని తక్కువ చేయాల్సిన పనిలేదు. టైర్ 2 హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు వర్కవుట్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు బడా నిర్మాతలు కూడా మీడియం సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఓ పెద్ద సినిమా తీయడం కంటే, అదే సొమ్ముతో 4 మీడియం సినిమాలు తీయడం వల్ల లాభాలు గడించొచ్చన్న ప్లానింగులు వేసుకొంటున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి వచ్చిన సినిమాల్లో 90 శాతం మీడియం రేంజ్ చిత్రాలే. అవే.. సితారకు లాభాల్ని తీసుకొచ్చాయి కూడా. మ్యాడ్, టిల్లు, టిల్లు స్క్వేర్, సార్, లక్కీ భాస్కర్ ఇవన్నీ మీడియం సినిమాలే. వాటితోనే సితార నాగవంశీ ఎక్కువ లాభాల్ని చవి చూశారు. సంస్థ పేరు కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు సితారలో యేడాదికి ఒక పెద్ద సినిమా తయారవుతోంటే, మీడియం బడ్జెట్ చిత్రాలు 4 పట్టాలెక్కుతున్నాయి. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారిన నిర్మాత దిల్ రాజు కూడా ఇదే దారిలో పయనిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఆయన్నుంచి వచ్చిన పెద్ద సినిమా `గేమ్ చేంజర్` పల్టీలు కొట్టింది. మీడియం బడ్జెట్ లో తీసిన `సంక్రాంతికి వస్తున్నాం` ఊహించని లాభాలు తీసుకొచ్చింది. దాంతో ఆయన కూడా మీడియం రేంజ్ సినిమాలే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. సంస్థకంటూ ఓ పేరు నమ్మకం ఉన్నప్పుడు ఓటీటీ, నాన్ థియేట్రికల్ రైట్స్ ఈజీగా వచ్చేస్తాయి. మీడియం రేంజ్ సినిమాలు వాటితోనే సగం గట్టెక్కేస్తాయి. రిస్క్ తక్కువ. అన్నీ అనుకొన్నట్టు జరిగితే భారీ లాభాలు చవి చూడొచ్చు. ఒకదాంట్లో పోయినా మరో సినిమాతో రాబట్టుకోవచ్చన్న భరోసా ఉంటుంది. బివిఎస్ఎన్ ప్రసాద్. డివివి దానయ్య లాంటి బడా నిర్మాతలు తమ సంస్థల నుంచి ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలే వదులుతున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ కూడా ఈ తరహా కథలనే ఇప్పుడు సిద్ధం చేసుకొంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే టైర్ 2 హీరోలకూ, వాళ్ల సినిమాలకూ మంచి గిరాకీ ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఎప్పుడైనా చిత్రసీమలో సమతూల్యం ముఖ్యం. అన్ని రకాల సినిమాలూ రావాల్సిందే. అప్పుడే బ్యాలెన్స్ కనిపిస్తుంది. కాకపోతే ట్రెండ్ ని ఫాలో అవ్వడం అలవాటు పడిన నిర్మాతలు ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇదెంత కాలమో చూడాలి.