సినిమా స్టార్లంటే ప్రజల్లో చాలా మంది ఆరాధనా భావం ఉండేది నిన్నామొన్నటి వరకు. కానీ గత నెల రోజుల్నుంచి రోడ్డున పడిన టాలీవుడ్ పరువు.. సినీ ప్రేక్షకుల మదిలో చిరకాలం ఉండిపోతుంది. రోజు రోజుకు బయటపడుతున్న మురికి.. దాన్ని శుభ్రం చేసే ప్రయత్నంలో బయటకు వచ్చి ఒక్కొక్క స్టార్ మాట్లాడుతున్న మాటలు… సినీ పరిశ్రమ విలువను దిగజార్చుతూ పోతున్నాయి. సినిమా భాషలో చెప్పుకోవాలంటే.. మాస్ పేరుతో చేసే విచ్చలవిడి వేషాలన్నీ… మాస్ లో కాదు.. టాలీవుడ్ లోనూ ఉన్నాయని సాక్ష్యాలతో సహా వారు నిరూపిస్తున్నారు. తామూ అందరిలో భాగమేనంటున్నారు. తమ దగ్గరా మృగాలున్నాయంటున్నారు. తమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని రెచ్చిపోతున్నారు.
నిజానికి టాలీవుడ్ ఈ పరిస్థితి రావడం కారమం టాలీవుడే. సినీకళామతల్లి నీడన కాస్త పాపులారిటీ సంపాదించుకోగానే.. కళ్లు నెత్తికెక్కి… ఏది పడితే అది వాగి.. పబ్లిసిటి పొందే నటులు, టెక్నిషియన్లే… ప్రస్తుతం టాలీవుడ్ దుస్థితికి కారణం. తమకు కొద్దిగా పాపులారిటీ ఉంది.. తాము కొద్దిగా తేడాగా మాట్లాడితే.. మీడియాలో కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. ఆ ఫ్లాట్ పాం మీద రాజకీయంగా కూడా పాపులారిటీ సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో… కొంత మంది మీడియాకు ఎక్కి చేసిన రచ్చే టాలీవుడ్ కు ఈ దుస్థితిని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
బ్రోకర్లు, జోకర్లు అంటూ రాజకీయ నాయకులపై టాలీవుడ్ ప్రముఖులుగా చెప్పుకున్న కొందరు పేలినప్పుడే..సినీ పరిశ్రమ మేలుకోవాల్సింది. అలాంటి భాష.. ఇతరుల తమపై వాడితే… అంతకు మించిన పబ్లిసిటీ వస్తుందని… అది టాలీవుడ్ ఫ్యూచర్ కే ప్రమాదమని వారు గుర్తించలేకపోయారు. మాదాకా రాలేదు కదా అని ఉండిపోయారు. ఫలితంగా ఆ భాషనే ఆదర్శంగా తీసుకుని.. ఇప్పుడు చెలరేగిపోతున్నారు. అవకాశాలు రాలేదని.. రచ్చ ప్రారంభించిన శ్రీరెడ్డి వెనుక ఉన్నది కూడా.. ఓ సినీ ప్రముఖుడే. రాజకీయాల మీద. సిని రంగంలో తనకు పడని వాళ్ల మీద తరచూ వీడియోలు పెట్టే ఆ సినీ ప్రముఖుడే.. శ్రీరెడ్డితో రచ్చ చేయిస్తున్నారని అందరికీ తెలుసు. ఇప్పుడదని.. టాలీవుడ్ కూడా ఆపలేని స్థాయికి వెళ్లిపోయింది.
ముల్లు వెళ్లి ఆకు మీద పడినా.. ఆకు వెళ్లి ముల్లు మీద పడినా.. ఆకుకే చినిగిపోతుంది. చాలా సినిమాల్లో ఈ సామెతను.. టాలీవుడ్ తన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంది.ఇప్పుడు రియల్ గా.. టాలీవుడ్ ది కూడా ఇదే పరిస్థితి. సినీ గ్లామర్ ఉంది కదా.. అని అందరిపై రెచ్చిపోయిన కొందరి వల్లే… ఇప్పుడీ పరిస్థితి వచ్చింది. టాలీవుడ్ సంస్కారవంతంగా ఉండి ..టాలీవుడ్ పైనే ఇప్పుడు వచ్చినటువంటి విమర్శలు, వివాదాలు వస్తే..సాధారణ సినీ ప్రేక్షకుల్లో సినీపరిశ్రమపై సానుభూతి వచ్చేది.కానీ ఇప్పుడు సానుభూతి రాలేదు. కానీ అంతకంటే ఎక్కువగా ఇమేజ్ కు టోటల్ డ్యామేజ్ అవుతోంది. అది పూర్తి స్థాయి పతనానికి దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు.