ఐదేళ్లు.. సరిగ్గా ఐదేళ్లు. జగన్ రెడ్డి ప్రభుత్వం వల్ల, ఆ నాయకుల అరాచకాల వల్ల ఏపీ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, టాలీవుడ్ కూడా అంతే సతమతమైంది. ఈ ఐదేళ్లూ టాలీవుడ్ ని జగన్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. కేవలం జగన్ గెలవగానే. ఎవరూ బొకేలతో వెళ్లలేదన్నది ఆయన కోపం. ఆ కోపాన్నంతా చూపించేసుకొన్నారు. టికెట్ రేట్లు తగ్గించేసి ఇష్టానుసారం ప్రవర్తించారు. టాలీవుడ్ మొత్తాన్ని తన కాళ్ల దగ్గరకు రప్పించుకొన్నారు. దండాలు పెట్టించుకొన్నారు. ఐనా కనికరం చూపించలేదు. బెనిఫిట్ షోలకు అనుమతుల్లేవు. అవార్డుల్లేవు. షూటింగులు చేసుకొంటే రాయితీలు లేవు. ఉన్న ఒకే ఒక్క రామానాయుడు స్టూడియోపైనా కత్తి కట్టారు. ఇలా అన్ని వైపుల నుంచీ దాడులే.
మరోసారి వైకాపా ప్రభుత్వం వస్తే ఏమైపోతామో అనే బెంగ, భయం టాలీవుడ్ లోని నిర్మాతల్లో కనిపించింది. `ఈసారి వైకాపా వస్తే.. చిత్రసీమ ఏపీ గురించి మర్చిపోవాల్సిందే` అనుకొన్నారంతా. ఇలాంటి దశలో వైకాపాని అధఃపాతాళానికి తొక్కేసింది కూటమి. మళ్లీ పచ్చ జెండా రెపరెపలాడింది. దాంతో టాలీవుడ్లో సంబరాలు మొదలయ్యాయి. టీడీపీకీ చిత్రసీమకూ అవినాభావ సంబంధం ఉంది. చాలామంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు టీడీపీ పక్షం. ఈ ఎన్నికల్లో వాళ్లంతా పరోక్షంగా టీడీపీపి సపోర్ట్ చేశారు. వాళ్ల కళ్లల్లో ఆనందం, ఉత్సాహం, సంబరం స్పష్టంగా కనిపిస్తోంది.
ఏపీలో కొత్త స్టూడియోలకూ, రాయితీలకూ, అవార్డులకూ ఇప్పుడు మార్గం సుగమం అయ్యింది. కాకపోతే కొత్త ప్రభుత్వం కుదుట పడడానికి కాస్త టైమ్ కావాలంతే! ఆ తరవాత నిజమైన పండగ మొదలవుతుంది.