ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ లేదు… అంటూంటారు. కొన్ని రకాల పోటీల్లో, పోరులో గెలుపు వైపు నడిపించే క్రమంలో ఇలా ఉత్తేజ పరచడం జరుగుతుంది. అయితే… ఇదే తరహాలో ఒక వ్యక్తిని పొగడడంలో పోటీ పడ్డారా అన్నట్లు తెలుగు సినీతారలు మాట్లాడారు.
అది ప్రపంచ తెలుగు మహాసభల వేదిక. ఆ ప్రాంగణంలోనే టాలీవుడ్ తారలను సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగు సినీలోకం స్పందించిన తీరు విస్తుగొలిపింది. తెలుగు భాష కు పట్టం కట్టాల్సిన వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగిడేoదుకు పోటీ పడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి అంతటి హీరో కూడా కేసీఆర్ ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన ప్రసంగంలో అత్యధీక సమయం కేసీఆర్, కేటీఆర్ ల స్తోత్రమే. ఇక మోహన్ బాబు తెలంగాణ కోసం పట్టు పట్టి సాధించిన కేసీఆర్ ఓ గొప్ప పోరాట యోధుడు అంటూ సందర్భ శుద్ది లేని పొగడ్తలు కురిపించారు. ఏకంగా ఒక శాలువా తెచ్చి కెటిఆర్ కు తానూ సన్మానించారు.
విప్లవ చిత్రాల హీరో ఆర్ నారాయణ మూర్తి సైతం ఇదే బాట అనుసరించండo విశేషం. భావి ప్రధాని గా కేసీఆర్ ను చూడాలని ఉందంటూ ఆయన కోరుకోవడం ఆశ్చర్యకరం. తాను అందరూ పొగిడారు కాబట్టి పొగడడం లేదంటూనే కేసీఆర్ ఒక కారణ జన్ముడు అంటూ కీర్తించారు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఇక సూపర్ స్టార్ కృష్ణ, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు తదితరులు కూడా యదాశక్తి అదే బాట లో ప్రసంగాలు చేశారు.
భాషను కాపాడే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం మహాసభలు నిర్వహిస్తోంది. నిర్వహణా తీరు తెన్నుల గురించి ప్రశంసలు, విమర్శలూ ఉన్నాయి. అదలా ఉంచితే ఈ మహాసభలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు మునుపు కూడా జరిగాయి.
తెలుగు కు సంబంధించి అంత పెద్ద కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు సినీ తారలు బావి తరాలకు భాషా పరమైన స్ఫూర్తి ని పంచేలా మాట్లాడి ఉంటే బాగుండేది. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసారంటూ ఒక వాక్యo లో కేసీఆర్ కు అభినందనలు తెలియజేస్తే సరిపోయే దానికి మాట్లాడినంత సేపూ సీఎం ని, ఆయన కుమారుడు కేటీఆర్ ని పొగడడమే పనిగా పెట్టుకోవడం చిరాకు తెప్పించింది.
ఈ పొగడ్తల వెల్లువకి భిన్నంగా మాట్లాడి ఆకట్టుకున్నారు బాలకృష్ణ. తెలుగు భాష గురించి సాధికారంగా మాట్లాడుతూ ఆలోచన రేకేత్హించేలా ప్రసంగించారు. పనిలో పనిగా నిర్విరామంగా 3 నిమిషాల పాటు అచ్చమైన తెలుగులో మాట్లాడలేక పోతున్నాం అంటూ తమ ప్రసంగంలో ఆంగ్ల పదాలు దొర్లకుండా ఆపలేకపోయిన చిరంజీవి తదితరులకు చురకలు అంటించారు. నాగార్జున, వెంకటేష్ లు రెండు మూడు వాక్యాల తో పొదుపుగా మాట్లాడి పరువు నిలబెట్టుకున్నారు